షూ వేసుకోకుంటే ఇండియా పరువు పోతుందా?

Update: 2016-02-04 10:49 GMT
ఢిల్లీ ముఖ్యమంత్రి - ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌ కు విశాఖకు చెందిన ఇంజినీర్ సుమిత్ అగర్వాల్ 364 రూపాయల డీడీ పంపించారు.  ఇంతకీ ఆయన ఆ మొత్తానికి ఢిల్లీ సీఎంకు పంపించడానికి గల కారణం తెలిస్తే ఆశ్చర్యమేయకమానదు. కేజ్రీవాల్ కు షూ కొనుక్కోమంటూ ఆయన ఈ డబ్బు పంపించారు. విదేశీయులు వచ్చినప్పుడు వారి వద్ద కాస్త హుందాగా ఉండాలని సూచిస్తూ అందుకు కాళ్లకు చెప్పులు బదులు షూ వేసుకోవాలని సూచిస్తూ విశాఖ ఇంజినీర్ ఈ విరాళమిచ్చారు.

సుమిత్ ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ కు బహిరంగ లేఖ రాశారు. తన లేఖలో ఆయన కేజ్రీవాల్ తీరుపై ఆశ్చర్యం వ్యక్తంచేస్తూ ఇకనైనా భారత్ పరువు తీయడం మానుకోండి, మంచి షూ వేసుకోండి... కావాలంటే డబ్బులు నేనిస్తాను అని చెప్పారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి నిలయంలో ఆ రోజున విందు ఇచ్చారు. దీనికి కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు. కేజ్రీ ఎప్పుడూ చాలా సాదాసీదాగా ఉంటారు. ఆ రోజూ అలాగే వచ్చారు. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రెంచ్ అధ్యక్షులు ఫ్రాంకోయిస్ హోలాండే కూడా ఈ విందుకు వచ్చారు. అక్కడ అంతా టిప్పుటాప్ గా ఉంటే కేజ్రీ ఒక్కరే అతిసాధారణంగా ఉన్నారు. దీంతో సుమిత్ బాధపడ్డారట. అందుకే ఆయన తన లేఖలో... విదేశీయుల ముందు ఎలా ఉండాలో నేర్చుకోవాలని కేజ్రీకి చెప్పారు.

అయితే... విశాఖ యువకుడి సూచన బాగానే ఉన్నా 364 రూపాయల డీడీ తీసి పంపడం మాత్రం కేజ్రీని అవమానించడమే. అంతేకాదు... హుందా.. విదేశీయుల ముందు వారిలా ఉండాలని చెప్పిన సుమిత్ కూడా షూ కోసం కేవలం 364 రూపాయలే పంపించారు. మరి ఆ డబ్బుతో షూ వస్తుందా... వచ్చినా అది విదేశీ నేతల స్థాయికి తగ్గట్లుగా ఉంటుందా అన్నది సుమితే చెప్పాలి. కేవలం సంచలనం, కేజ్రీని అవమానించడం కోసం, మీడియాలో హైలైట్ కావడం కోసమే అలా చేసినట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News