ఆర్ బీఐ గవర్నర్ ను డిసైడ్ చేసేశారట

Update: 2016-07-12 04:14 GMT
అంచనాలకు భిన్నంగా ఆర్ బీఐ గవర్నర్ గా సరికొత్త పేరు తెర మీదకు వచ్చింది. రాజన్ వారసుడిగా ఇప్పటికే పలు పేర్లు వినిపించినప్పటికీ.. అందుకు భిన్నంగా సరికొత్త పేరు బయటకు వచ్చింది. ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటు చసిన నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగారియాకు ప్రతిష్ఠాత్మక ఆర్ బీఐ గవర్నర్ పదవి లభించనున్నట్లుగా చెబుతున్నారు. రాజన్ వారసుడి నిర్ణయం జరిగిపోయిందని.. మోడీ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆయన పేరును వెల్లడిస్తారంటూ కొన్ని ఛానళ్లు ప్రకటించాయి. విశ్వసనీయ వర్గాల నుంచి తమకు అందిన సమాచారంతోనే తామీ విషయాన్ని చెబుతున్నట్లుగా సదరు ఛానళ్లు ప్రకటించాయి.

సెప్టెంబరు 4తో రాజన్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో.. ఆయన వారసుడి పేరును వెంటనే వెల్లడించే వీలుంది. ఆర్ బీఐ గవర్నర్ గా ఎంపిక చేసే వ్యక్తి పేరును ప్రకటించిన వెంటనే ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించి.. గవర్నర్ పదవీ కాలం పూర్తి అయిన వెంటనే ఆ బాధ్యతను చేపట్టే ప్రత్యేక సౌకర్యం ఉంది. ఈ నేపథ్యంలో  అరవింద్ పనగారియా పేరును మోడీ భారత్ కు వచ్చిన తర్వాత ప్రకటిస్తారని చెబుతున్నారు. ఆర్థికపరమైన విధానాల్లో కేంద్రానికి కీలక సలహాలు ఇచ్చే సంస్థగా ఉన్న నీతి అయోగ్ కు వైస్ ఛైర్మన్ గా ఉన్న పనగారియా  జీ 20 దేశాల సమావేశంలో భారత కీలక ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ ముఖ్య ఆర్థికవేత్తగా.. మేరీ ల్యాండ్ వర్సిటీలో ఆర్థిక విభాగంలో ప్రొఫెసర్ గా పని చేశారు. ప్రపంచ బ్యాంక్.. అంతర్జాతీయ ద్రవ్యనిధిలోనూ పని చేసిన ట్రాక్ రికార్డు ఉంది.

రాజన్ వారసుడిగా ఎంపిక కష్టమని.. రాజన్ లాంటి వ్యక్తిని ఆర్ బీఐ గవర్నర్ గా తీసుకురాలేరన్న వాదనలు పలువురు వినిపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాజన్  కు ధీటైన వ్యక్తిని ఆర్ బీఐ గవర్నర్ గా ఎవరిని మోడీ ఎంపిక చేస్తారన్న ఆసక్తి పెద్ద ఎత్తున వ్యక్తమైంది. అందరికి ఆశలకు.. అంచనాలకు తగ్గట్లే మోడీ ఎంపిక ఉందన్న అభిప్రాయం పనగారియా పేరు బయటకు వచ్చినప్పుడు వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News