మ‌జ్లిస్ ముస్లిం పార్టీ కాదంట‌

Update: 2015-08-21 09:53 GMT
మిగిలిన రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నా.. వాటి సిద్ధాంతం.. వాటి వైఖ‌రి.. విధానాల విష‌యంలో ఎంతోకొంత క‌న్ఫ్యూజ‌న్ ఉండొచ్చేమో కానీ.. మ‌జ్లిస్ పార్టీ గురించి రాజ‌కీయాల‌కు ఏ మాత్రం ప‌రిచ‌యం ఉన్న ఎవ‌రిని అడిగినా.. క‌ళ్లు మూసుకొని మ‌రీ అదెలాంటి పార్టీనో చెప్పేస్తారు.

మైనార్టీల గురించి త‌ప్ప‌.. మ‌రో మాట వినిపించ‌ని ఆ పార్టీ ఏనాడు.. సామాజిక స‌మ‌స్య‌ల మీద‌.. ఆర్థిక.. రాజ‌కీయ అంశాల మీద మాట్లాడింది లేదు. విభ‌జ‌న లాంటి అంశం విష‌యంలోనూ ఆచితూచి వ్య‌వ‌హ‌రించిందే త‌ప్పించి.. త‌మ వాద‌న‌ను స్ప‌ష్టంగా వినిపించింది లేదు.

నోరు విప్పిన ప్ర‌తిసారీ మ‌తం గురించి మాట్లాడ‌టం.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌టం త‌ప్పించి మ‌రో ప‌ని చేయ‌ని ఆ పార్టీ ముస్లింల పార్టీ కాద‌ని పేర్కొన‌టం విశేషం. తాజాగా ఒక జాతీయ ప‌త్రిక‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ లో త‌మ పార్టీ ముస్లిం పార్టీ కాద‌ని.. తాము అంద‌రి కోసం ప‌ని చేస్తామ‌ని చెప్పుకొచ్చారు.

హైద‌రాబాద్‌లోని దారుస‌లాంలో రాత్రిపూట ఆ పార్టీ పెట్టే స‌మావేశాల్లో అస‌దుద్దీన్ కానీ.. ఆయ‌న సోద‌రుడు అక్బ‌రుద్దీన్ కానీ ఏ విష‌యాల్ని ప్ర‌స్తావిస్తారో హైద‌రాబాదీయుల‌కు ఎరుకే. మహారాష్ట్రలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 25 స్థానాల్లో పోటీ చేసి.. రెండు స్థానాల్నికైవ‌శం చేసుకున్న ఆ పార్టీ ఇప్పుడు క‌ర్ణాట‌క మీద క‌న్నేసింది.

క‌ర్ణాట‌క‌లో త‌న ప‌ర్య‌ట‌న‌కు అడ్డుకుంటున్న ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. కొద్ది నెల‌ల్లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామ‌ని.. అప్పుడు త‌న‌ను ఎలా అడ్డుకుంటారో చూస్తాన‌ని అస‌దుద్దీన్ చెప్పుకొచ్చారు. ముంబ‌యి పేలుళ్ల కేసులో ఉరిశిక్ష ప‌డిన యాకూబ్ మెమ‌న్‌ను మ‌తం దృష్టితో చూసి.. ఉరిశిక్ష విధించ‌టం త‌ప్ప‌న్న అస‌దుద్దీన్‌.. త‌న పార్టీకి క్లీన్ చిట్ ఇచ్చుకోవ‌టం ఆయ‌న‌కు మాత్ర‌మే స‌రిపోతుందేమో.
Tags:    

Similar News