ట్రంప్ ప్రైవేట్ విష‌యాలు కూడా ఓవైసీ తెలుసుకున్నాడే!

Update: 2019-09-26 07:15 GMT
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం నేపథ్యంలో న్యూయార్క్‌ లో  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ...ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.  మోదీకి ముందు అనేక సమస్యలతో ఉన్న భారతదేశం.. ఆయన హయాంలో ఒకేతాటిపైకి వచ్చిందని మోదీని ప్రశంసించారు. భారతదేశ పితగా ఆయనను అభివర్ణించారు. భారత్‌ - అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలను పెంపొందించుకునేందుకు త్వరలోనే భారత్‌ తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్‌ లైట్‌ హైజర్‌.. భారత్‌ తో సంప్రదింపులు జరుపుతున్నారని - త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని పేర్కొన్నారు. ఈ కామెంట్ల‌పై హైద‌రాబాద్ ఎంపీ - ఎంఐఎం నేత అస‌దుద్దీన్ ఓవైసీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఎంఐఎం పార్టీ అధినేత - హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్‌ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత ప్రధాని మోదీని భారత జాతిపిత అని అభివర్ణించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతిపిత మహాత్మాగాంధీతో మోదీకి ఏ మాత్రం పోలికలు లేవన్నారు. ‘ట్రంప్‌ ప్రధాని మోదీని జాతిపిత అని వ్యాఖ్యానించడం ఆయన అవివేకానికి నిదర్శనం. భారత చరిత్ర తెలియకుండా అయన అలా మాట్లాడుతున్నారు. దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ చేసిన త్యాగాలు వెలకట్టలేనివి. అందుకే ఆయన జాతిపిత అయ్యారు. దేశం కోసం ఎంతో త్యాగం చేసిన నెహ్రూ - సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ లకు కూడా ఆ బిరుదు దక్కలేదు. అసలు గాంధీకి మోదీకి పోలికెక్కడిది’ అని అసదుద్దీన్‌ ఒవైసీ  ప్రశ్నించారు.

అమెరికా వాణిజ్యం గురించి స్పందిస్తూ ఓవైసీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ‘మన దేశానికి చెందిన పెట్రోనెట్‌ కంపెనీ అమెరికాలోని టెలూరి యన్‌ కంపెనీలో రూ.15,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. వాస్తవానికి టెలూరియన్‌ కంపెనీ ట్రంప్‌ కు అనుకూలమైనది. ట్రంప్‌ కు అనుకూలంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా భారత పౌరులకు ఏ మేరకు లాభమో అర్థం కావడం లేదు’ అని అసదుద్దీన్‌ పేర్కొన్నారు. కశ్మీర్‌ విషయంలో ట్రంప్‌ డబుల్‌ గేమ్‌ అడుతున్నారని - ఇటు మోదీని పొగుడుతూ అటు ఇమ్రాన్‌ ఖాన్‌ ను ఎగేస్తున్నారని విమర్శించారు. ట్రంప్‌ మరోసారి అమెరికా అధ్యక్షుడు అవుతారని హ్యూస్టన్‌ సభలో ప్రధాని మోదీ ప్రచారం చేయడం ఎంతవరకు ఔచిత్యమనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలన్నారు.


Tags:    

Similar News