రాజుగారి అలక : మాట పడే ఖర్మ నాకేంటి?

Update: 2016-09-01 17:30 GMT
అవునుగానీ తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్రమంత్రి అశోక్‌ గజపతి రాజు ఏమైపోయినట్లు? మన రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాల్సిందే గానీ.. కేంద్రం ఇచ్చే మూడ్‌ లో లేదని చాలా సందర్భాల్లో సిన్సియర్‌ గా ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చిన, ఉన్నదున్నట్లు చెబుతూ వచ్చిన అశోక్‌ గజపతి రాజు కొన్ని రోజులుగా అసలు కనిపించడం లేదు. అయితే ఏం జరిగిందా? అని ఆరా తీస్తే ఆయన అలక వహించారని.. అనవసరంగా తాను మాటలు పడాల్సి వస్తున్నందుకు కోపంగా ఉన్నారని తెలుస్తోంది.

తిరుపతిలో పవన్‌ కల్యాణ్‌ పెట్టిన సభలో తెలుగుదేశం ఎంపీలందరినీ జనాంతికంగా తిట్టేస్తూ.. ప్రత్యేకించి అశోక్‌ గజపతి రాజును మాత్రం పేరుపెట్టి విమర్శించారు. ''రాష్ట్రానికి హోదా కోసం మీరు పదవిని వదలి వచ్చేయలేరా... మీకెందుకు రాజుగారూ'' అంటూ పవన్‌ దులిపేశారు.

అయితే అశోక్‌ గజపతి రాజు గతంలో వేర్వేరు సందర్భాల్లో తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు కూడా! ఓ సందర్భంలో అయితే.. చంద్రబాబునాయుడు తనను కించపరిచేలా మాట్లాడినందుకు.. అక్కడికక్కడే రాజీనామా చేసేస్తానంటూ అశోక్‌ గజపతి రాజు అలగడం, ఆయనను ఇతరులు బుజ్జగించడం జరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి. ప్రత్యేక హోదా విషయంలోనూ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందనే భావనతోనే అశోక్‌ చాలా సందర్భాల్లో మాట్లాడారు. తమ రాజీనామాలతో వచ్చేట్లయితే వెంటనే రాజీనామాలు ఇచ్చేయగలనని సిన్సియర్‌ గా చెప్పారనేది జనం అభిప్రాయం.

అయితే ఇంత చేస్తున్నా తాను ఇలా పవన్‌ కల్యాణ్‌ లాంటి వ్యక్తి చేత మాటలు పడాల్సి వచ్చిందంటే.. ఆయనకు బాధ కలిగినట్లుగా చెబుతున్నారు. అందుకే ఎక్కడా కనిపించడం లేదంటున్నారు. మూడు రోజులుగా ఢిల్లీలో ఏపీకి కేంద్రం చేయగల సాయం గురించి తేల్చడానికి మంతనాలు జరుగుతోంటే.. ఒక్క సుజనా తప్ప అశోక్‌ నామమాత్రం గా కూడా అక్కడ లేరు. ఇవాళ సుజనా చౌదరి ప్రెస్‌ మీట్‌ పెట్టి.. ఏం ప్యాకేజీ రాబోతున్నదో చెప్పే ప్రయత్నం చేసినప్పుడు, ఆయన వెంటన కొందరు ఎంపీలు ఉన్నారే తప్ప.. మరో మంత్రి అశోక్‌ కనిపించలేదు. పార్టీ వైఖరి తమ పరువుకు భంగం కలిగిస్తోందనే అలకతో అశోక్‌ ఉన్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News