ప్రత్యేక హోదా కోసం రాజుగారి రాజీనామా?

Update: 2016-05-17 07:22 GMT
ఏపీ ప్రత్యేక హోదా అంశం ముదిరి పాకాన పడిన సమయంలో నేతలంతా దాదాపుగా కప్పదాట్లు వేస్తున్నారే కానీ ఎవరూ దూకుడు గల నిర్ణయాలు తీసుకోవడం లేదు. కేంద్రం మెడలు వంచేలా ఒత్తిడి పెంచలేకపోతున్నారు. ఈ తరుణంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు మాత్రం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఏకంగా రాజీనామా చేస్తానంటున్నారు. అయితే... ఏపీ సీఎం చంద్రబాబునాయుడు - టీడీపీ నేతలు మాత్రం ఆయన్ను వారిస్తున్నారట. ఇప్పుడిప్పుడే రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు.. సంయమనం పాటించండి అని సూచిస్తున్నారట.  అశోక్ చేసిన రాజీనామా వ్యాఖ్యలు ఇప్పుడు సంలచనంగా మారాయి. ప్రత్యేక హోదా కోసం అంతా చొక్కాలు చించుకుంటున్నట్లుగా కలర్ ఇవ్వడమే తప్ప ఇలా రాజీనామా చేస్తామని చెప్పిన నేత ఒక్కరూ లేరు. అలంటి తరుణంలో ఆయన అడుగు ముందుకేసి అవసరమైతే తాను ఇప్పటికిప్పుడు రాజీనామా చేసేస్తానని ప్రకటించారు. ఆయన మాటలతో ఒక్కసారిగా షాకయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ‘‘మీరు అంత పని చేయొద్దు.. ఆలోచించి నిర్ణయం తీసుకుందాం’’ అని వారించారట.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏ త్యాగానికైనా సిద్ధమేనని అశోక్ గజపతిరాజు తేల్చేశారు. ప్రధానితో భేటీ నేపథ్యంలో చంద్రబాబు టీడీపీ ముఖ్యులతో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో అశోక్ తీవ్రంగా స్పందించారట. కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ బయటకు వస్తేనే బీజేపీ సర్కారుపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుందన్న విపక్షం - ప్రజా సంఘాల వాదనలను గుర్తు చేసిన అశోక్...  కేంద్ర మంత్రి పదవికి ఇప్పటికిప్పుడు రాజీనామా చేసేందుకు తాను సిద్ధమేనని ప్రకటించారు. దీంతో చంద్రబాబు సహా సమావేశానికి హాజరైన వారంతా ఆయనను వారించారు. ‘‘విపక్షాలు లక్ష చెబుతాయి. కానీ, రాష్ట్రానికి ఏది మంచిదో మనమే చూసుకోవాలి. కేబినెట్ లో ఉంటే ఒత్తిడి కొనసాగించడానికి, రాష్ట్రానికి మరిన్ని తెచ్చుకోవడానికి వీలవుతుంది. తెగదెంపుల వల్ల ప్రయోజనమేమీ ఉండదు’’ అని చెప్పడంతో ఆయన శాంతించారట.

అయితే...  పదవులను పెద్దగా పట్టించుకోని అశోక్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడంతో మరో కేంద్ర మంత్రి సుజనా మాత్రం కంగారు పడుతున్నారట. అశోక్ ఆవేశానికి పోయి రాజీనామా చేస్తే ఆయనతో పాటు తాను కూడా రాజీనామా చేయాల్సి వస్తుందని.. మోడీ తనకు ఎప్పుడు ఉద్వాసన పలుకుతారో తెలియదన్నట్లుగా ఉన్న ఈ పరిస్థితుల్లో అంతకుముందే రాజీనామా చేయడాన్ని ఆయన ఏమాత్రం ఇష్టపడడం లేదట. అయితే.. చంద్రబాబు సహా నేతలంతా ఈ రాజీనామా ప్రతిపాదనకు అంగీకరించకపోవడంతో సుజనా ఊపిరి పీల్చుకున్నారని తెలుస్తోంది.
Tags:    

Similar News