అశ్విన్ ట్వీట్ పంచ్ కు తమిళులు ఫిదా

Update: 2017-02-06 09:18 GMT
ప్రత్యర్థి బ్యాట్స్ మెన్లకు చుక్కలు చూపించేలా బాల్స్ వేయటంలో మాత్రమే నేర్పరి అనుకునే భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా తనలోని మరో కోణాన్ని ప్రదర్శించి ఇప్పుడు వార్తల్లోకి ఎక్కారు. తాజాగా తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై అతగాడి ఆగ్రహాన్ని.. పొందిగ్గా ఒక ట్వీట్ గా మార్చి.. వ్యంగ్యంగా చేసిన ట్వీట్ ఇప్పుడు తమిళుల మనసుల్ని విపరీతంగా దోచుకోవటమే కాదు.. ఆన్ లైన్లో వైరల్ గా మారింది.

‘‘త్వరలో తమిళనాడు రాష్ట్ర యువతకు 234 ఉద్యోగాలు రావటం ఖాయం’’ అంటూ అశ్విన్ చేసిన ట్వీట్ వ్యాఖ్యలపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తన పదవికి రాజీనామా చేస్తూ.. తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళను నియమించేందుకు వీలుగా పన్నీరు సెల్వం.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో అశ్విన్ ఈ తరహా ట్వీట్ చేయటం హాట్ టాపిక్ గా మారింది.

తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యేందుకు శశికళ చేస్తున్న ప్రయత్నాలపై తమిళులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా చెబుతున్న వేళ.. అశ్విన్ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అతగాడి ట్వీట్ కు పలువురు మద్దతుగా వ్యాఖ్యలు చేయటం గమనార్హం. తమిళనాడు అసెంబ్లీలో 234 స్థానాలు ఉండటం.. అమ్మ మరణం తర్వాత చోటు చేసుకున్న రాజకీయ ప‌రిణామాల నేప‌థ్యంలో.. త్వరలో ఎన్నికలు రానున్నాయ‌న్న అర్థం వ‌చ్చేలా ట్వీట్ ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. చిన్న‌మ్మ సీఎం అయ్యేందుకు పావులు క‌ద‌ప‌టంపై ప‌లువురు వ్య‌తిరేకిస్తున్న వేళ‌లో.. అశ్విన్ సైతం త‌న అభిప్రాయాన్ని తాజా ట్వీట్ తో వెల్ల‌డించిన‌ట్లుగా చెబుతున్నారు. క్రికెటర్ గా సుపరిచితుడైన యువ క్రికెటర్ చేసిన ఈ ట్వీట్ పంచ్ తమిళుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే.. తాను చేసిన ట్వీట్ ఒక ఉద్యోగ మేళాకు సంబంధించిందే కానీ.. రాజ‌కీయ కోణంలో తాను ఆ ట్వీట్ చేయ‌లేద‌ని పేర్కొన‌టం గ‌మ‌నార్హం. ఉన్న‌ట్లుండి అశ్విన్ ఎందుకు వెన‌క్కి త‌గ్గిన‌ట్లు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News