తిరుమ‌ల‌లో స‌ర్వ పాపాలు జ‌రుగుతున్నాయి: అగ్ర నిర్మాత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2022-07-29 07:30 GMT
వైజ‌యంతీ మూవీస్.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని సినీ నిర్మాణ సంస్థ‌. న‌ట‌ర‌త్న ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవిల‌తో ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాల‌ను అందించింది. వైజ‌యంతీ మూవీస్ అధినేత అశ్వినీద‌త్ అనే విష‌యం తెలిసిందే. తాజాగా ఈ అగ్ర నిర్మాత చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైర‌ల్ గా మారాయి.

వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం తిరుప‌తిని స‌ర్వ నాశ‌నం చేసింద‌ని అశ్వినీద‌త్ నిప్పులు చెరిగారు. అక్క‌డ జ‌ర‌గ‌ని పాపం లేద‌ని.. ఈ పాపాల‌న్నింటిని స్వామి ఇంకా ఎందుకు చూస్తున్నాడో అర్థం కావ‌డం లేద‌ని హాట్ కామెంట్స్ చేశారు. తిరుమ‌ల‌లో చంద్ర‌బాబు హ‌యాంలో వేయి కాళ్ల మండ‌పాన్ని కూల్చేస్తే చిన‌జీయ‌ర్ స్వామి నాడు టీడీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశార‌ని త‌ప్పుబ‌ట్టారు. చంద్ర‌బాబు ఆగ‌మ శాస్త్ర నియ‌మాల ప్ర‌కార‌మే వేయి కాళ్ల మండ‌పాన్ని కూల్చివేశార‌ని గుర్తు చేశారు.

ఈ మూడేళ్ల‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌త‌మార్పిడుల‌ను ప్రోత్స‌హించింద‌ని.. తిరుమ‌ల‌లో స‌ర్వ‌పాపాలు చేస్తోంద‌ని అయినా చిన‌జీయ‌ర్ స్వామి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేద‌ని మండిప‌డ్డారు. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని హిమాల‌యాల్లో 150 కి.మీ వేగంతో కారు న‌డిపేవాడు స్వామీజీ ఎలా అవుతాడ‌ని చిన‌జీయ‌ర్ స్వామిపై ధ్వ‌జ‌మెత్తారు. అలాగే కొన్ని కోట్ల మంది భ‌క్తులు కొలిచే స‌మ్మ‌క్క - సార‌ల‌మ్మ‌ల‌ను అవ‌మానిస్తూ చిన‌జీయ‌ర్ స్వామి గ‌తంలో చేసిన వ్యాఖ్య‌ల‌ను అశ్వినీద‌త్ తీవ్రంగా ఖండించారు. స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ‌లు దేవ‌త‌లు కాద‌ని చిన‌జీయ‌ర్ చేసిన వ్యాఖ్య‌లు విని త‌న‌కు క‌డుపు మండిపోయింద‌ని తెలిపారు. త‌న బావ‌మ‌రిది డాక్ట‌ర్ అని.. ఆయ‌న స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ‌ల‌ను బాగా విశ్వ‌సిస్తార‌ని చెప్పారు. తన ఇద్ద‌రు కుమార్తెలు పేరు స్వ‌ప్న‌, శేషు ప్రియాంక‌ల పేర్లను కూడా ఆ త‌ల్లులిద్ద‌రి పేర్లు క‌లిసేటట్టు పెట్టాన‌ని వివ‌రించారు.

అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేస్తున్న చ‌ర్య‌ల‌తో తిరుప‌తి ప్ర‌తిష్ట మ‌స‌క‌బారింద‌ని అశ్వినీద‌త్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. వీటిని ఖండించ‌ని చిన‌జీయ‌ర్ స్వామి.. వైఎస్ జ‌గ‌న్ ను క‌లియుగ దైవంగా అభివ‌ర్ణించ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏపీకి పున‌ర్వైభ‌వం రావాల‌న్నా, తిరుమ‌ల మ‌ళ్లీ పూర్వ రూపు సంత‌రించుకోవాల‌న్నా చంద్ర‌బాబు అధికారంలోకి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. చంద్ర‌బాబు మ‌రోసారి ముఖ్య‌మంత్రి అవుతాడ‌నే న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని చెప్పారు.

కాగా 2004 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున విజ‌య‌వాడ ఎంపీగా అశ్వినీద‌త్ పోటీ చేసి ఓట‌మిపాల‌య్యారు. కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసిన ల‌గ‌డ‌పాటి రాజగోపాల్.. అశ్వినీద‌త్ పై గెలుపొందారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అశ్వినీద‌త్ పోటీ చేయ‌లేదు. అయితే టీడీపీలోనే కొన‌సాగుతున్నారు.

క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన చ‌ల‌సాని అశ్వినీదత్ ప్ర‌స్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ తో ప్రాజెక్ట్ కె చిత్రాని భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. అలాగే దుల్క‌ర్ స‌ల్మాన్, సుమంత్ కాంబినేష‌న్ లో నిర్మించిన సీతారామం ఆగ‌స్టులో విడుద‌ల కానుంది.
Tags:    

Similar News