అంతరిక్షం నుంచి రాంగ్ కాల్?

Update: 2015-12-26 07:09 GMT
పొరపాటున ఒక నెంబర్ నుంచి మరో నెంబర్ కు కాల్ చేయటం.. నాలుక్కర్చుకోవటం మామూలే. అయితే.. ఇలాంటి సందర్భంలో ఫోన్ చేసిన వ్యక్తి సారీ చెప్పటం.. ఫోన్ రిసీవ్ చేసుకోవటం కాస్తంత విస్కుకోవటం.. లేదంటే ఓకే అనేయటం మామూలే. కానీ.. ఇందుకు భిన్నంగా ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న మహిళ కొద్దిపాటి షాక్ తిన్న పరిస్థితి.

ఎందుకంటే.. అంతరిక్ష కేంద్రంలో ఉన్న బ్రిటన్ వ్యోమగామి మేజర్ టిమ్ పీకే.. తన ఇంటికి ఫోన్ చేసే ప్రయత్నంలో పొరపాటున మరో నెంబర్ కు ఫోన్ చేశాడు. ఇదేమీ తెలీని సదరు మహిళ.. ఫోన్ ఎత్తిన వెంటనే..‘‘హలో.. ఇది భూ గ్రహమేనా?’’ అంటూ అవతల నుంచి ప్రశ్న వేయగానే కంగుతింది. దీంతో.. తాను పొరపాటున వేరే వారికి కాల్ చేశానని తెలుసుకున్న వ్యోమగామి సారీ చెప్పేసి ఫోన్ పెట్టేశాడు.

అనంతరం తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేస్తూ.. ఈ విషయానికి సంబంధించి వివరణ ఇచ్చాడు. తాను పొరపాటున తప్పుగా నెంబర్ కు డయల్ చేశానని.. ఒక మహిళకు ఆ ఫోన్ కాల్ వెళ్లిందని.. తన వల్ల జరిగిన అసౌకర్యనికి క్షమాపణలు చెబుతున్నానని.. తప్పుడు ఉద్దేశంతో తాను అలా చేయలేదంటూ వివరణ ఇచ్చాడు. టిమ్ పొరపాటున ఫోన్ చేసినా.. సదరు మహిళకు మాత్రం అంతరిక్షం నుంచి ఫోన్ కాల్ వచ్చిందన్న విషయం అర్థమైతే చాలు.. ఆ అనుభూతిని జీవితాంతం ఉంచుకుంటుందనటంలో సందేహమే లేదు. అసలు అంతరిక్షం నుంచి ఎంతమందికి ఫోన్ కాల్స్ వస్తాయేంటి?
Tags:    

Similar News