భార‌త రాజకీయాల్లో అలాంటి సీన్ రాదేమో?

Update: 2018-08-17 04:23 GMT
అధికార ప‌క్ష అధినేత‌.. విప‌క్ష నేత‌.. ఉప్పు నిప్పులా ఉంటారు. ఇప్పుడు న‌డుస్తున్న బార‌తంలో ముఖ‌ముఖాలు చూసుకోవ‌టానికి ఇష్ట‌ప‌డ‌రు. అంత‌దాకా ఎందుకు?.. మొన్నీ మ‌ధ్య‌నే పార్ల‌మెంటులో మోడీ స‌ర్కారుపై ఏపీ అధికార‌ప‌క్షం పెట్టిన అవిశ్వాసంపై చ‌ర్చ సంద‌ర్భంగా త‌న మ‌న‌సులో ఏమీ లేదంటూ నిండుస‌భ‌లో రాహుల్ గాంధీ ప్ర‌ధాని మోడీని ఆత్మీయ ఆలింగ‌నం చేసుకున్నారు. దానికి క‌నీసం స్పంద‌న‌ను ప్ర‌ద‌ర్శించ‌లేదు స‌రిక‌దా..కొద్ది గంట‌ల త‌ర్వాత అలా చేసిన రాహుల్ గాంధీని ఎట‌కారాలు ఆడేసి.. నిప్పులు చెరిగే విమ‌ర్శ‌ల్ని సంధించారు ప్ర‌ధాని మోడీ.

అంతేనా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంగ‌తే చూద్దాం. త‌న‌కెంతో ఇష్టుడని.. పెద్ద‌మ‌నిషి అంటూ జానారెడ్డిని పేర్కొంటూనే.. విప‌క్ష నేత‌గా ఉన్న ఆయ‌న‌పై కొన్నిసార్లు ఎలాంటి మాట‌లు సంధిస్తారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇక‌.. ఏపీ అసెంబ్లీ విష‌యానికి వ‌స్తే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విష‌యంలో ఇంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అంతేనా.. త‌మిళ‌నాడులో ఈ మ‌ధ్య కాలంలో మ‌ర‌ణించిన పుర‌ట్చిత‌లైవి జ‌య‌ల‌లిత‌.. క‌ళైంజ‌ర్ క‌రుణానిధి ఇద్ద‌రు అధికార విప‌క్ష అధినేత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ముఖ‌ముఖాలు చూసుకోవ‌టానికి సైతం ఇష్ట‌ప‌డ‌ని వైరం తెలిసిందే.

ఇలా.. ఒక‌ట్రెండు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి విష‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న విష‌యం ఇప్పుడు అంద‌రికి తెలిసిందే. మ‌రి.. అలాంటి ప్ర‌తిప‌క్ష నేత‌ను ఏరికోరి.. భార‌తదేశ ప్ర‌తినిధిగా ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి పీవీ న‌ర‌సింహారావు ఎంపిక చేసి మ‌రీ అంత‌ర్జాతీయ వేదిక మీద‌కు పంప‌టం సాధ్య‌మా? అంటే.. ఇప్ప‌టి దూకుడు రాజ‌కీయాలు తెలిసిన వారంతా నో అనేస్తారు. కానీ.. జ‌రిగింది వేరు. వాజ్ పేయ్ మీద న‌మ్మ‌కం.. ఆయ‌న రాజ‌కీయ తీరుపై న‌మ్మ‌కం ఉన్న పీవీ.. భారీ బాధ్య‌త‌ను అప్ప‌గించి మ‌రీ ఐక్య‌రాజ్య స‌మితికి పంపిన చారిత్ర‌క ఘ‌ట్టం భార‌త రాజ‌కీయాల్లో మ‌రోసారి వ‌చ్చే అవ‌కాశం లేదేమో.

అప్ప‌ట్లో జ‌రిగిందేమంటే..  1994లో జెనీవాలో ఐక్య‌రాజ్య స‌మితి మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ ప్ర‌త్యేక స‌ద‌స్సును నిర్వ‌హించారు. దీనికి భార‌త ప్ర‌తినిధిగా వాజ్ పేయ్ ను పంపుతూ ఊహించ‌ని నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు నాటి ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు. అప్ప‌టికి వాజ్ పేయ్ లోక్ స‌భ‌లో విప‌క్ష నేత‌గా ఉన్నారు. క‌శ్మీర్ లో మాన‌వ‌హ‌క్కుల ఉల్లంఘ‌న‌లు జ‌రుగుతున్నాయంటూ స‌ద‌స్సులో భార‌త్ ను ఇబ్బంది పెట్టాల‌ని పాకిస్థాన్ తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. పాక్ ఆరోప‌ణ‌ల్ని వాజ్ పేయ్ నేతృత్వంలోని బృందం స‌మ‌ర్థంగా తిప్పి కొట్టింది. దీంతో.. దాయాదిపై దౌత్య విజ‌యాన్ని సాధించిన‌ట్లైంది.

ప్ర‌ధాని హోదాలో పీవీ తీసుకున్న నిర్ణ‌యాన్ని ఆమోదించి జెనీవాకు వెళ్లి త‌న స‌త్తాను ప్ర‌ద‌ర్శించ‌టం ఒక ఎత్తు అయితే..వాజ్ పేయ్ స‌మ‌ర్థ‌త మీద ఉన్న న‌మ్మ‌కంతోనే పీవీ ఆ నిర్ణ‌యాన్ని తీసుకున్నార‌ని చెబుతారు. అయితే.. రాజ‌కీయ ప్రయోజ‌నం కోసం.. వ్యూహాత్మ‌కంగానే వాజ్ పేయ్ ను పీవీ జెనీవాకు పంపార‌న్న చ‌ర్చ న‌డుస్తున్న నేప‌థ్యంలో..ఆ విష‌యాన్ని వాజ్ పేయ్ లోక్ స‌భ‌లో ప్ర‌స్తావిస్తూ.. త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించి న‌వ్వులు పువ్వులు పూయించారు. ఆ సంద‌ర్భంగా వాజ్ పేయ్ ఏమ‌న్నారంటే.. పీవీ గొప్ప వ్యూహ ర‌చ‌యిత‌. జెనీవాలో ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదురైతే.. న‌న్ను బ‌లిప‌శువును చేయొచ్చ‌ని కూడా ఆయ‌న భావించి ఉండొచ్చ‌చు అని త‌న హాస్య చ‌తుర‌త‌ను ప్ర‌ద‌ర్శించి న‌వ్వులు పూయించారు.

విప‌క్ష నేత‌ను క‌నీసం గౌర‌వించాల‌న్న సంస్కారం లేని నేటి రాజ‌కీయాల్లో నాటి విలువ‌లు వ‌చ్చేనా?  అంటే.. నో అని చెప్ప‌క త‌ప్ప‌దు. అలాంటివి వాజ్ పేయ్.. పీవీలాంటి వారితోనే ముగిశాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News