పాక్ లో వినాయక టెంపుల్ పై దాడి.. ఎంత ఆగం చేశారంటే?

Update: 2021-08-06 04:07 GMT
ప్రపంచంలో మైనార్టీలు ఎక్కడున్నా.. వారికి జరిగే అన్యాయాలపై వినిపించాల్సిన గళం ఒకేలా ఉండాలి. అంతేకాదు.. భిన్నంగా వ్యవహరించటం సరికాదు. మీడియాలో వచ్చే కొన్ని కథనాల్ని చూస్తున్నప్పుడు.. సంయమనం పేరుతో చేసే చేష్టలు చాలామంది మనోభావాల్ని దెబ్బ తీస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. అయోధ్యలోని వివాదాస్పద కట్టడంపై జరిగిన దాడికి సంబంధించి పేరు ఎక్కడా ప్రస్తావించొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా.. మీడియా మాత్రం నిర్మోహమాటంగా పేరును ప్రస్తావించింది. భారత్ లో మైనార్టీలు.. ఇతర దేశాల్లో మెజార్టీలుగా ఉన్న చోట్ల కూడా అక్కడి మీడియా.. పేరును నేరుగా ప్రస్తావించాయి. ఆగమాగం చేశాయి.

బ్యాడ్ లక్ ఏమంటే.. దాయాది పాకిస్తాన్ లో వందలాది దేవాలయాలు దాడులకు గురవుతున్నా.. దాని గురించి వచ్చిన వార్తల్ని సింగిల్ కాలమ్ కు పరిమితం చేయటం.. ఒకవేళ కాస్త పెద్దదిగా వార్త ఇచ్చినప్పటికి అందులో ప్రార్థనాలయం లాంటి పేర్లతో విషయాన్ని పూర్తిగా తెలీకుండా చేస్తుంటారు. ఈ గోప్యతకు కారణమేంటి? అన్నది క్వశ్చన్. పాక్ లో మైనార్టీలుగా ఉన్న హిందువులకు సంబంధించిన ప్రార్థనాలయంపై జరిగిన దాడిపై భారత్ లో వార్త వచ్చే సమయంలో తెలిసితెలీనట్లుగా సమాచారం ఇచ్చే కొన్ని మీడియా సంస్థలు సాధించేదేమిటన్నది ఎంత థింక్ చేసినా అర్థం కాదు.

తాజాగా పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో సిద్ధి వినాయక ఆలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఆలయంలోని విగ్రహాల్ని ధ్వంసం చేశారు. కొన్ని విగ్రహాల్ని తగలెట్టి ఆరాచకాన్ని క్రియేట్ చేశారు. రహీంయార్ ఖాన్ జిల్లాలోని భోంగ్ నగరంలో ఈ దారుణం జరిగింది. ఇంతకూ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందన్న వివరాల్లోకి వెళితే.. ఒక ముస్లిం పాఠశాలలో ఏదో దరిద్రపుగొట్టు పని జరిగిందంటూ ఒక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వెంటనే కొందరు దుండగులు.. ఇనుప రాడ్లు.. కర్రలు.. కట్టెలు తీసుకొని ఆలయంపై దాడికి పాల్పడ్డారు.

గుడికి పరిసర ప్రాంతాల్లోని కొన్ని మైనార్టీ కుటుంబాలపై దాడికిదిగారు. ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలను పాక్ లోని హిందూ మండలి అధ్యక్షుడు రమేశ్ వాన్ కానీ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. స్థానిక పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. జిల్లా పోలీసులు మాత్రం అక్కడ నివసిస్తున్న వంద కుటుంబాలకు రక్షణ కల్పించినట్లుగా చెబుతున్నారు. ఈ ఘటనపై ఇమ్రాన్ సర్కారు తీవ్రంగా స్పందించింది. దాడికి పాల్పడిన దోషుల్ని అరెస్టు చేయాలని ఆదేశించింది. దేవాలయాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది.

పాకిస్తాన్ లోని మైనార్టీల పరిస్థితి చాలా ఘోరంగా ఉందని ఆ దేశ తెహ్రీక్ - ఇ - ఇన్సాఫ్ ఎంపీ డాక్టర్ రమేశ్ వాంక్వానీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణ విధ్వంసంపై భారత్ తీవ్రంగా స్పందించింది. పాక్ లోని మైనార్టీలపై జరుగుతున్న వరుస దాడుల్ని అక్కడి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని పేర్కొంది. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. భారత్ లోని పాక్ తాత్కాలిక దౌత్యాధికారిని పిలిపించి.. తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు విదేశాంగ వ్యవహారాల శాఖా ప్రతినిధి వెల్లడించారు.
Tags:    

Similar News