గుంటూరులో క‌ల‌క‌లం:జ‌న‌సేన కార్యాల‌యంపై దాడి!

Update: 2019-02-05 06:10 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ సంచ‌ల‌న ఘ‌ట‌న చోటుచేసుకుంది. గుంటూరులో జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంపై దాడి జ‌రిగింది. పూటుగా మ‌ద్యం తాగిన కొంద‌రు ఆక‌తాయిలు కార్యాల‌యంపైకి బీరు సీసాలు విసిరారు. విధ్వంసం సృష్టించారు. ఈ ఘ‌ట‌న‌పై జ‌న సైనికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వారి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు.

గుంటూరులోని ఇన్న‌ర్ రింగ్ రోడ్డులో జ‌న‌సేన పార్టీ కార్యాల‌యాన్ని కొత్త‌గా నిర్మించారు. గ‌త నెల 27న పార్టీ అధినేత ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ దాన్ని ప్రారంభించారు. పూజ‌లు నిర్వహించారు. పెద్ద‌యెత్తున జ‌న సైనికులు అందులో ప్రారంభోత్స‌వంలో పాల్గొన్నారు. అయితే, ఆర్ద‌రాత్రి కొంద‌రు ఆక‌తాయిలు రెచ్చిపోయారు.

పూటుగా మ‌ద్యం సేవించి ద్విచ‌క్ర వాహ‌నాల‌పై అక్క‌డికి వ‌చ్చారు. జ‌న‌సేన పార్టీ కార్యాయ‌లంపై బీరు బాటిళ్ల‌తో దాడి చేసారు. దీంతో కార్యాల‌యం అద్దాలు ధ్వంస‌మ‌య్యాయి. అక్క‌డున్న పార్టీ కార్యాల‌యం సిబ్బందిపై కూడా దుండ‌గులు దాడికి ప్ర‌య‌త్నించారు. అనంత‌రం అక్క‌ణ్నుంచి ప‌రార‌య్యారు. దాడి ఘ‌ట‌న మొత్తం పార్టీ కార్యాల‌య ఆవ‌ర‌ణ‌లో ఉన్న సీసీటీవీల్లో రికార్డ‌యింది.

ఈ ఘ‌ట‌న‌పై జ‌న‌సేన సైనికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల‌ను ప‌రిశీలిస్తున్నారు. దాడికి పాల్ప‌డిన దుండ‌గుల‌ను త్వ‌ర‌లోనే ప‌ట్టుకుంటామ‌ని వారు విశ్వాసం వ్య‌క్తం చేశారు.

దాడికి పాల్ప‌డిన దుండ‌గులు ఎవ‌రనే దానిపై ప్ర‌స్తుతం స‌ర్వ‌త్రా ఆసక్తి నెల‌కొంది. రాజకీయంగా జనసేనను ఎదుర్కోలేక ప్ర‌త్య‌ర్థి పార్టీల నాయ‌కులు ఇలాంటి నీచమైన దాడులను ప్రోత్సహిస్తున్నారంటూ జ‌న‌సేన సైనికులు మండిప‌డుతున్నారు. దాడిని పిరికిపంద‌ల హేయ‌మైన చ‌ర్య‌గా అభివ‌ర్ణిస్తున్నారు. త‌మ కార్యాల‌యంపై దాడి ఘ‌ట‌న ప‌ట్ల ప‌వ‌న్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి!
   


Tags:    

Similar News