మన కుర్రాడిపై ఆస్ట్రేలియా ప్రధాని జోక్

Update: 2019-01-03 04:13 GMT
భారత క్రికెట్ జట్టు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాడు. కొన్ని నెలల కిందటే టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన పంత్.. కొన్ని సంచలన ఇన్నింగ్స్ లతో ఆకట్టుకున్నాడు. ఐతే ఆటతో కంటే అతడి మాటలు ఈ మధ్య హాట్ టాపిక్ అయ్యాయి. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సందర్భంగా ప్రత్యర్థి జట్టు కెప్టెన్ టిమ్ పైన్ తో అతడి స్లెడ్జింగ్ ఆట రసవత్తరంగా సాగింది. ముందు పైన్ అతడిని కవ్వించాడు. హోబర్ట్ కు వచ్చేయ్.. నా పిల్లల్ని చూసుకో.. నేను నా భార్యతో కలిసి సినిమాకు వెళ్తా అంటూ పైన్ పంత్ ను కవ్వించడం.. తర్వాత ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సందర్భంగా పంత్ అతడికి దీటుగా బదులివ్వడం చర్చనీయాంశమైంది.

పైన్ ను ‘తాత్కాలిక కెప్టెన్’గా అభివర్నించిన పంత్.. అతనెప్పుడూ మాటలు మాట్లాడతాడే తప్ప ఆడలేడంటూ ఎద్దేవా చేశాడు. ఇదంతా ఒకెత్తయితే.. పైన్ తనను స్లెడ్జింగ్ చేసినట్లుగానే సరదాగా అతడి పిల్లల్ని తర్వాత ఓ కార్యక్రమంలో ఎత్తుకోవడం మరో ఎత్తు. ఇలా గత వారం రోజుల్లో పంత్ సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ అయ్యాడు. తాజాగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ సైతం అతడిని గుర్తించడం.. తనపై ఒక జోక్ కూడా పేల్చడం విశేషం.

నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ కోసం సిడ్నీకి వచ్చిన ఇరు జట్ల ఆటగాళ్లకు ఆసీస్‌ ప్రధాని స్కాట్‌ మారిసన్‌ తన నివాసంలో విందు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రిషభ్‌ పంత్‌ ఆసీస్‌ ప్రధానికి తారసపడగా.. అక్కడున్న భారత జట్టు మేనేజర్ సునీల్ సుబ్రమణ్యం అతడిని పరిచయం చేయబోయాడు. మారిసన్‌ వెంటనే ‘‘ఇతను నాకెందుకు తెలియదు.. పంత్‌.. నీవు స్లెడ్జ్‌ చేశావ్‌ కదా. నీ స్లెడ్జింగ్‌ ను నేను స్వాగతిస్తున్నాను. మేం ఇలాంటి రసవత్తర పోరునే ఇష్టపడతాం’ అనడం విశేషం. దీంతో అక్కడ అందరిలో నవ్వులు విరిశాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.


Full View


Tags:    

Similar News