బాబు ఇలాఖాలో అవినీతి గురించి మంత్రే చెప్పాడు

Update: 2017-06-03 06:24 GMT
ఏపీలో జ‌రుగుతున్న అవినీతిపై ఇన్నాళ్లు విపక్షాల నుంచి తీవ్ర విమ‌ర్శలు - వాటికి ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న ఎదుర‌వ‌గా...తాజాగా అధికార పార్టీ నుంచే ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అది కూడా మంత్రి స్థాయిలో ఉన్న నాయ‌కులు సొంత స‌ర్కారులో సాగుతున్న అవినీతి బాగోతంపై భ‌గ్గుమంటున్నారు. ఈ క్ర‌మంలో అత్యంత ఆస‌క్తిక‌రంగా ప్ర‌జ‌లు చ‌ప్ప‌ట్లు చ‌రుస్తూ మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం విశేషం. విశాఖలో పెద్దఎత్తున జరిగిన నవ నిర్మాణ దీక్ష ఈ ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాల‌కు వేదిక అయింది. విశాఖ‌లో భారీ స్థాయిలో భూదందా జ‌రుగుతున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టి నవ నిర్మాణ దీక్షకు హాజరైన ఆర్ అండ్ బి మంత్రి అయ్యన్నపాత్రుడు భూదందాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

విశాఖలో ఎన్‌ ఆర్‌ ఐ - ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు ఆరోపించారు. ఎక్కడి నుంచో విశాఖ వచ్చి కోట్ల రూపాయల విలువైన భూములను ఆక్రమించుకుంటుంటే మనం ఎందుకు చూస్తుండాలని అయ్యన్న ప్రశ్నించారు. ఆక్రమణదారులను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తన మిత్రుడైన ఓ ఎన్‌ ఆర్‌ ఐ భూమిని కబ్జాదారులు ఆక్రమించుకున్నారని, పోలీసుల సహకారంతో తిరిగి స్వాధీనం చేసుకున్నామన్నారు. తన మాదిరి మిగిలిన బాధితులు భూములను స్వాధీనం చేసుకోలేరు కదా? అని ప్రశ్నించారు. మంత్రిగా సహకరిస్తే, తాను కూడా రెండెకరాలు ఆక్రమించుకుంటానని ఒక వ్యక్తి తన వద్దకు వచ్చాడంటూ అయ్యన్నపాత్రుడు చెప్పారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు కలెక్టర్ - జాయింట్ కలెక్టర్ - పోలీస్ కమిషనర్ పటిష్ట చర్యలు తీసుకుంటున్నా, రాజకీయ జోక్యంతో వారు ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు. ఇకపై విశాఖ జిల్లాలో భూకబ్జాలను అరికట్టేందుకు మంత్రిగా అధికారులకు తను మద్దతిస్తానని అయ్యన్న చెప్పారు.

జిల్లాలో అవినీతి అధికారుల ఆగడాలు పెరిగిపోతున్నాయని అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆర్ అండ్ బి ఇంజనీర్ వందల కోట్ల అక్రమాస్తులు ఏవిధంగా కూడబెట్టాడని ప్రశ్నించారు. విశాఖ కేంద్రంగా ఎంతోమంది ఉన్నతాధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూ బకాసురులను - అవినీతి అధికారులను తరిమికొడదామని అయ్యన్న పిలుపునిచ్చారు. అయ్యన్న సభలో మాట్లాడుతున్నంతసేపు, సభలో జనం కేరింతలు కొట్టడం విశేషం. కాగా విశాఖలో భూకబ్జాలపై సీనియ‌ర్ మంత్రి, ఇటు ప్ర‌భుత్వంలో అటు పార్టీలో కీల‌క స్థానంలో ఉన్న అయ్య‌న్న‌పాత్రుడు చేసిన వ్యాఖ్యలతో అధికారులు, ప్రజా ప్రతినిధులు అవాక్కయ్యారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News