పాత్రుడి పాత్ర ముగిసిందా? కొడుక్కు ఛాన్స్ ద‌క్కేనా?

Update: 2021-09-03 00:30 GMT
వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ధాటిని త‌ట్టుకుని గెల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్న తెలుగు దేశం పార్టీ ఆ దిశ‌గా కొత్త ర‌క్తాన్ని పార్టీలోకి ఎక్కించ‌నుంద‌ని స‌మాచారం. పాత నీరు పోతేనే కొత్త నీరు వ‌స్తుంద‌నే చందాన సీనియ‌ర్లు త‌ప్పుకుంటేనే యువ నాయ‌కుల‌కు అవ‌కాశం ద‌క్కే వీలుంది. ఈ నేప‌థ్యంలోనే టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు రాజ‌కీయాల నుంచి రిటైర్ కానున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. రాజ‌కీయాల్లో త‌న పాత్ర‌ను ఆయ‌న ముగించే అవ‌కాశాలున్నాయ‌నే చ‌ర్చ‌లు జోరందుకున్నాయి. రాజ‌కీయాలకు ఆయ‌న గుడ్‌బై చెప్పే ఊహాగానాలు నిజ‌మ‌ని తెలుగు త‌మ్ముళ్లు అంటున్నారు.

దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ 1982లో పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి అయ్య‌న్న టీడీపీలోనే కొన‌సాగుతున్నారు. 1983లో తొలిసారి విశాఖ‌ప‌ట్నం జిల్లా న‌ర్సీప‌ట్నం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయ‌న‌.. ఆ త‌ర్వాత మ‌రో అయిదు సార్లు అక్క‌డ త‌న జెండా ఎగ‌రేశారు. ముఖ్యంగా 2004లో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ ధాటిని త‌ట్టుకుని ఆయ‌న నిల‌బ‌డ్డారు. 1996లో అన‌కాప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీగానూ గెలుపొందారు. దీంతో అయ్య‌న్న‌కు ప్రాధాన్య‌త ఇచ్చిన చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌వినీ క‌ట్ట‌బెట్టారు. కానీ గ‌త ఎన్నిక‌ల్లో తాను త‌ప్పుకుని త‌న కుమారుడు విజ‌య్‌కు టికెట్ ఇప్పించేందుకు అయ్య‌న్న కోరాడు. కానీ వైసీపీ నుంచి బ‌ల‌మైన పోటీ ఉండ‌డంతో పాటు విజ‌య్‌పై సొంత కుంటుంబం నుంచి విమ‌ర్శ‌లు రావ‌డం ఆయ‌న బాబాయే స్వ‌యంగా చంద్ర‌బాబు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్ర‌బాబు విజ‌య్‌ను కాద‌ని మ‌రోసారి అయ్య‌న్న‌కే టికెట్ కేటాయించారు. కానీ జ‌గ‌న్ హ‌వా ముందు నిల‌వ‌లేక అయ్య‌న్న ఓట‌మి పాల‌య్యారు.

ఇప్పుడు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి. ప‌రిస్థితుల్లోనూ మార్పు వ‌స్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయ్య‌న్న‌కు కాకుండా మ‌రో నాయ‌కుడికి టికెట్ ఇవ్వాల‌ని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు ప్ర‌తిపాదించారు. 65 ఏళ్లు నిండిన నాయ‌కుల‌కు టికెట్ ఇవ్వ‌రాద‌ని ఇటీవ‌ల పార్టీలో తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు కిశోర్ చంద్ర‌దేవ్‌, శ‌త్రుచ‌ర్ల విజ‌య‌రామ‌రాజు, రాయ‌పాటి సాంబ‌శివ‌రావు వంటి సీనియ‌ర్ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టాల‌ని అనుకున్నారు. ఆ జాబితాలో అయ్య‌న్న కూడా ఉన్నారు. దీంతో ఆయ‌న్ని కూడా ప‌క్క‌న‌పెడితేనే మిగిలిన వారు కూడా సానుకూలంగా స్పందిస్తార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో దాదాపు మూడు ద‌శాబ్దాల రాజ‌కీయ ప్ర‌స్థానానికి ముగింపు ప‌లికేందుకు అయ్య‌న్న సిద్ధ‌మైన‌ట్లు నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనే పోటీ నుంచి త‌ప్పుకుంటాన‌ని చెప్పిన ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగ‌ర‌నే విష‌యం స్ప‌ష్ట‌మైపోయింద‌ని టాక్‌. ఆయ‌న రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుని త‌న కొడుకు విజ‌య్ పొలిటిక‌ల్ కెరీర్‌ను చ‌క్క‌దిద్దేందుకు ప్రయ‌త్నించ‌నున్నార‌ని తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కొడుక్కు టికెట్ ద‌క్కేలా ఆయ‌న ప్ర‌య‌త్నించ‌నున్నార‌ని స‌మాచారం.




Tags:    

Similar News