ఓటు అడిగిన అయ్య‌న్న‌ను సెల్ అడిగిన టీచ‌ర్

Update: 2018-09-06 04:55 GMT
సీనియ‌ర్ టీడీపీ నేత‌ల‌కు ఏమైందో కానీ.. ఇటీవ‌ల కాలంలో వారు బ‌ర‌స్ట్ అవుతున్నారు. ద‌శాబ్దాలు కొద్దీ రాజ‌కీయాలు న‌డిపిన వారంతా.. ఇప్పుడు కొత్త కొత్త మాట‌లు చెప్ప‌టం అల‌వాటు చేసుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే రాజ‌కీయాల మీద సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసే ఏపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి త‌ర‌హాలోనే మంత్రి అయ్య‌న్న  పాత్రుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఇటీవ‌ల కాలంలో రాజ‌కీయ పార్టీల్లో టికెట్ల కేటాయింపుపై త‌న‌కు ఎదుర‌వుతున్న అనుభ‌వాల్ని ఆయ‌న త‌న‌దైన శైలిలో వెల్ల‌డించారు. ఒక‌ప్పుడు రాజ‌కీయాల్లో వ్య‌క్తుల గొప్ప‌త‌నాన్ని చూసి టికెట్లు ఇచ్చేవార‌ని.. ఇప్పుడు పార్టీ టికెట్ అడిగితే ఎన్ని కోట్లు ఖ‌ర్చు చేస్తావ‌ని అడిగే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు.

కోట్లు ఖ‌ర్చు చేసి ఎన్నిక‌ల్లో గెలిచినోడు నిజాయితీగా ఎలా ఉంటార‌ని సూటిగా ప్ర‌శ్నించారు. ప్ర‌జాసేవ చేద్దామ‌నుకునే వారి ద‌గ్గ‌ర డ‌బ్బులు ఉండ‌వ‌ని చెప్పిన మంత్రి అయ్య‌న్న‌.. ఇటీవ‌ల కాలంలో ఓట‌ర్ల తీరు కూడా దారుణంగా మారింద‌ని చెప్పారు. ఇటీవ‌ల త‌న‌కు ఎదురైన ఒక అనుభ‌వాన్ని ఉదాహ‌ర‌ణ‌తో చెప్పుకొచ్చారు.

ఇటీవ‌ల జ‌రిగినఎమ్మెల్సీ  గ్రాడ్యుయేష‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఒక టీచ‌ర్ ఇంటి వ‌ద్ద‌కు వెళ్లాన‌ని.. అత‌ను.. అత‌డి భార్యా త‌న‌ను సెల్ ఫోన్ ఇవ్వాల‌ని కోరిన‌ట్లు చెప్పారు. ప‌విత్ర‌మైన అధ్యాప‌క వృత్తిలో ఉండి కూడా తాము వేసే ఓటుకు విలువ క‌డుతున్న వైనం చూస్తుంటే వేద‌న‌గా ఉంద‌ని వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News