తప్పు చేసిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో ప్రముఖ సినీనటుడు.. తెలంగాణ అధికారపక్ష ఎమ్మెల్యే బాబూ మోహన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి పోలీసులు ఇప్పిస్తున్న కౌన్సింగ్ కు బాబుమోహన్ ను ప్రత్యేకంగా పిలిపించారు. ఈ సందర్భంగా తాగి నడపటం వల్ల జరిగే నష్టాల గురించి ఏకరువు పెట్టారు.
ఈ సందర్భంగా తాగటం తప్పు అని చెప్పటం లేదని.. తాగి వాహనాల్ని నడపటమే తప్పని చెబుతున్నానని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా.. కొన్నేళ్ల క్రితం తన పెద్ద కొడుకు పవన్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించటాన్ని గుర్తు చేసుకున్న ఆయన విపరీతమైన భావోద్వేగానికి గురయ్యారు. దీంతో.. ఆయన కంటతడి పెట్టుకున్నారు. ఈ ఘటన కౌన్సిలింగ్ కు వచ్చిన వారిని కదిలించింది.
తాగేసి వాహనాలు నడిపేసి.. ప్రమాదాలకు గురైతే.. కుటుంబాలు అనాధలు అవుతాయని.. కుటుంబ సభ్యులకు తీరని శాపంగా మారుతుందని చెప్పిన బాబు మోహన్.. తాగి చనిపోవటం కుటుంబానికి పరువు తక్కువ పని అవుతుందని.. కుటుంబ సభ్యులు అవమాన భారంతో తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని.. అలాంటి పరిస్థితికి అవకాశం ఇవ్వొద్దని వ్యాఖ్యానించారు.