సరిహద్దు దాటి మరీ దాడులు చేస్తాం: రాజ్‌ నాథ్‌

Update: 2020-02-26 12:38 GMT
పాక్ సరిహద్దులోని కలుగుల్లో దాక్కున్న ఉగ్రమూకలు ....దొడ్డిదారిన భారత్ లోకి చొరబడి మారణహోమం జరపడం....ఆ దాడులకు తమకు సంబంధం లేదని పాక్ చేతులు దులుపుకోవడం పరిపాటి. గతంలో పాక్ లోపల నక్కిన గుంటనక్కలను మట్టుబెట్టేందుకు సవాలక్ష కారణాలు అడ్డువచ్చేవి. అయితే, అదంతా గతం..ప్రధాని మోడీ హయాంలో ట్రెండ్ మారింది. దెబ్బకు దెబ్బ....కంటికి కన్ను...పంటికి పన్ను అన్న తరహాలో భారత్ ఎదురుదాడి చేసింది. అందుకే - గత ఏడాది బాలాకోట్ లో దాగిన ముష్కర శిబిరాలపై ...భారత వైమానిక దళం మెరుపుదాడి చేసింది. ప్రమాదవశాత్తు పాక్ చెరలో చిక్కిన వింగ్ కమాండర్ అభినందన్ కోసం యావత్ ప్రపంచం భారత్ వెన్నంటి ఉంది. పాక్ కుటిల నీతికి భారత్ సరైన సమాధానం చెప్పిందని కొనియాడింది. నేటికి ఆ దాడి జరిగి సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా...కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ మరోసారి పాక్ కు వార్నింగ్ ఇచ్చారు. భారత్ జోలికి వస్తే....సరిహద్దు దాటి మరీ దాడి చేసేందుకు వెనుకాడే ప్రసక్తే లేదని రాజ్ నాథ్ హెచ్చరించారు.

ఉగ్రవాద నిర్మూలనలో భారత్ అనుసరించే విధానంలో మార్పు వచ్చిందని, గతంలో మాదిరి....ఊకదంపుడు ఉపన్యాసాలకు తమ ప్రభుత్వం పరిమితం కాబోదని రాజ్ నాథ్ అన్నారు. భారత్ కు అపకారం తలపెట్టాలనుకునే ఉగ్రమూకల అంతానికి సైన్యం రెడీగా ఉంటుందని - సరిహద్దు ఆవలికి వెళ్లి మరీ దాడి చేసేందుకు ఏ మాత్రం వెనుకాడదని అన్నారు. బాలాకోట్‌ ఆపరేషన్ లో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఇండియన్ ఎయిర్‌‌ ఫోర్స్‌కు సెల్యూట్ చేస్తున్నానని రాజ్ నాథ్ అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనదేశ పంథాలో మార్పు తెచ్చిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. 2016 సర్జికల్ స్ట్రయిక్స్ - బాలాకోట్‌ పై ఎయిర్ స్ట్రైక్స్ ఈ మార్పునకు నిదర్శమని - ఇది నూతన భారత దేశం అని రాజ్‌ నాథ్ అన్నారు.


Tags:    

Similar News