నంద్యాల పోరులోకి బాల‌య్య ఎంట్రీ

Update: 2017-08-07 17:30 GMT
అధికార తెలుగుదేశం పార్టీకి ప‌రువు స‌మ‌స్య‌గా మారిన నంద్యాల ఉప ఎన్నికలో గెలుపు కోసం టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ స్థాయిలో వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇటీవ‌ల నిర్వ‌హించిన ప్లీన‌రీ అనూహ్య‌రీతిలో విజ‌య‌వంతం అవ‌డం, ఎమ్మెల్సీ శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి పార్టీ ఫిరాయించడం వంటి ప‌రిణామాల‌తో వైసీపీ బ‌లం పెరుగుతోంద‌ని భావిస్తున్న చంద్ర‌బాబు నంద్యాలలో విజయం కోసం వీలైన ప్రతి సందర్భంలో సమీక్షిస్తూ పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌చారానికి సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను రంగంలోకి దింప‌నున్న‌ట్లు చంద్ర‌బాబు చెప్పిన‌ట్లు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం.

ఉపఎన్నిక గ‌డువు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో చంద్రబాబు ఏ మాత్రం నిర్లక్ష్యం లేకుండా పార్టీ శ్రేణులంద‌రినీ కలిపి ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. నంద్యాల నియోజకవర్గంలో శిల్పా మోహనరెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నిక సమయం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో నంద్యాల పార్టీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి - ఆయన సోద‌రి మంత్రి అఖిలప్రియకు చంద్రబాబు హిత‌బోధ చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్రతి క్షణం విలువైనదేనని గుర్తుంచుకోవాలని సూచించినట్లు స‌మాచారం. త్వరలో ఐటీ మంత్రి నారా లోకేష్ - ఆ తరువాత నంద‌మూరి బాల‌కృష్ణ‌ నంద్యాలలో పర్యటిస్తారని చంద్ర‌బాబు టీడీపీ శ్రేణుల‌కు వెల్లడించినట్లు సమాచారం. భూమా బ్రహ్మానందరెడ్డి విజయం ఖాయమని భారీ మెజారిటీ సాధించి ప్రత్యర్థి పార్టీపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు నంద్యాల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై కూడా సీఎం చంద్రబాబు మంత్రుల‌ను అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. రహదారుల విస్తరణ, పక్కాగృహాల నిర్మాణం, వ్యక్తిగత పథకాల్లో లబ్ధి, తదితర కార్యక్రమాల్లో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. పార్టీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి ఆశీర్వాద యాత్ర సందర్భంగా తెలుసుకున్న సమస్యలపై వెంటనే అధికారులను సంప్రదించి పరిష్కారం చూపాలని చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. కాగా నంద్యాల ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి శిల్పా మోహనరెడ్డి తీరే కారణమని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కావాలని చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావడం, పార్టీ మారడం వంటి చర్యలు ఆయనలో ఆగ్రహం తెప్పించాయని అంటున్నారు. నంద్యాల ప్రాంతీయుడు కాకపోయినా స్వయంగా చేపట్టిన పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో నంద్యాలలో తనకంటూ ప్రత్యేకంగా ఓటు బ్యాంకును శిల్పా మోహనరెడ్డి  పెంపొందించుకున్నారు. ఈ నేప‌థ్యంలో తన కంచు కోటగా భావిస్తున్న నంద్యాలలోనే శిల్పా మోహ‌న్ రెడ్డిని ఓడించి మానసికంగా దెబ్బ తీస్తే ఆయన అహం వీడుతుందనే దిశ‌గా టీడీపీ చ‌ర్య‌లు ఉన్నాయ‌ని అంటున్నారు.
Tags:    

Similar News