హతవిథీ....ఇదేమి తెలుగు నందమూరి...!?

Update: 2018-11-18 05:24 GMT
నందమూరి వంశం. ఒకప్పుడు తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక. ఈ గౌరవం దక్కించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. భాష పేరుతో ఓ రాజకీయ పార్టీని స్ధాపించి దాని కీర్తిని ప్రపంచం నలుమూలలా వ్యాపింప చేసిన మహనీయుడు ఎన్‌ టిఆర్. ఆయన మరణం తర్వాత ఆయన వారసులు తెలుగుదేశం పార్టీని విచ్ఛిన్నం చేయడమే కాదు...భాషను కూడా ఎన్ని విధాలుగా పాడు చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నారు. ఓ భాష పేరుతో ఉన్న పార్టీలో ఆ భాష గురించి తెలుసుకోకుండా.... కనీసం నేర్చుకునేందుకు ప్రయత్నం కూడా చేయకుండా తమ తప్పుల తడక భాషను ప్రజల ముందు ఉంచుతున్నారు. ఇది నందమూరి వంశానికే కాదు... యావత్ తెలుగు వారికే అవమానకరంగా మారిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది.  అయినా ఈ గోడును - ఆవేదనను పట్టించుకుందుకు వారేమైనా సాధారణ మానవులా. నందమూరి వంశస్థులు. ఇంతకీ విషయం ఏమిటనుకుంటున్నారు. నందమూరి నట సింహ అని ఆయన అభిమానులు పిలుచుకునే నందమూరి బాలక్రిష్ణ మాట్లాడుతున్న తెలుగును విన్న వారికి ఆత్మహత్యే శరణ్యం అనిపిస్తోంది.

నందమూరి హరిక్రిష్ణ కుమార్తె నందమూరి సుహాసిని (నిజానికి ఇది తప్పు. భారతీయ సంప్రదాయాన్ని అనుసరించి ఆమె... చుండ్రు సుహాసిని) కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి మహాకూటమి పొత్తులో భాగంగా తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. శనివారం నాడు సుహాసిని తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ వేడుకకు సుహాసిని బాబాయ్ - నటసింహం నందమూరి బాలక్రిష్ణ హాజరయ్యారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం బాలక్రిష్ణ అక్కడే ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు - అభిమానులనుద్దేశించి ప్రసంగించారు. బాలక్రిష్ణ ప్రసంగాలు సామాన్యులకు ఓ పట్టాన అర్ధం కావు. ఇక్కడ కూడా అదే పరిస్థితి.... తన అన్న నందమూరి హరిక్రిష్ణ మరణించినప్పుడు ఆయన అభిమానులు *సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు* అని బాలక్రిష్ణ వ్యాఖ్యానించారు. అసలు సంభ్రమాశ్చర్యాలు అంటే బాలక్రిష్ణకు అర్ధం తెలుసా అని నెటిజన్లు జోకుల మీద జోకులు పేల్చుకున్నారు.

అదేదో సినిమా హీరో మిత్రుడు ఓ కమెడియన్ కూడా ఇలాగే అర్ధం లేని డైలాగులు చెప్పి ఆనక ఏదో మాట బాగుందని వాడాను అంటారు. ఇది ఆ కమెడియన్ కి అయితే సరిపోతుంది. కాని బాలక్రిష్ణ కమెడియన్ కాదు కదా.... ఆయన హీరో కదా అని నెటిజన్లు అంటున్నారు. ఇక బాలక్రిష్ణ అల్లుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనయుడు - పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ అయితే మరీ దారుణం. ఆయనకు జయంతికి వర్ధంతి మధ్య ఉన్న తేడా కూడా తెలియదు. ఇక కొసమెరుపేమింటే కూకట్‌ పల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్ధిగా బరిలో దిగిన నందమూరి సుహాసిని అలియాస్ చుండ్రు సుహాసిని అయితే నామినేషన్ వేసిన తర్వాత అభిమానులను ఉద్దేశించి తెలుగును కూడబలుక్కుంటూ చేసిన ఉపన్యాసం వినే వారికి తెలుగుపై ప్రేను పోగొట్టడమే కాదు....అసహనాన్ని తెప్పిస్తుంది. ముందు ముందు ఇలాంటి ప్రసంగాలు ఇంకెన్ని వినాల్సి వస్తుందో అని కూకట్ పల్లి ఓటర్లు బెంబేలెత్తుతున్నారు.

    

Tags:    

Similar News