భక్తుల సేవే నారాయణుని సేవ అని అందరూ భావిస్తుంటారు. ప్రత్యేకించి శ్రీనివాసుడు కొలువుదీరిన తిరుమల పుణ్యక్షేత్రంలో స్వామివారిని చూసి తరించడానికి ఉత్సాహపడే భక్తులు ఎంత ఎక్కువమంది ఉంటారో.. దామాషాలో వారికి తీసిపోని విధంగా భక్తులకు సేవ చేయడానికి కూడా అనేకమంది ఉంటారు. నిజం చెప్పాలంటే.. భక్తులకు సేవ చేసే ఉద్దేశం అందరికీ ఉన్నప్పటికీ.. అవకాశం మాత్రం అందరికీ దక్కదు. అధికారికంగా టీటీడీ ఆ వెసులుబాటు కల్పిస్తే.. సేవ చేయడానికి పోటీ పడేవారు పెరిగిపోతారు గనుక.. అలాంటివి ఉండవు.
అయితే ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర, మంగళవారం నాడు తిరుమలలో అన్నదానం కార్యక్రమంలో స్వయంగా తాను భక్తులకు వడ్డించే పనిని స్వీకరించారు. తిరుమలేశుని బ్రహ్మూెత్సవాల సందర్భంగా రెండు రోజులుగా అక్కడే ఉన్న ఆమె.. బంధువులతో కలిసి తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రానికి మంగళవారం మధ్యాహ్నం చేరుకున్నారు. టీటీడీ మెంబరు సుచిత్రతో కలిసి భక్తులకు వడ్డించే పనిని స్వీకరించారు. అక్కడే వారితో కలిసే ఆమె కూడా భోం చేశారు. అన్నప్రసాదంలో భోజనంచేసే అనుభూతి చాలా గొప్పగా ఉన్నదని వ్యాఖ్యానించారు.
అంతా బాగానే ఉంది. తిరుమలేశుని సన్నిధిలో స్వామివారి భక్తులకు వడ్డించడం అంటే ఆ అవకాశం దక్కడం కూడా మహద్భాగ్యమే. ఇది కేవలం వీఐపీలకు మాత్రమే దక్కే ప్రత్యేకమైన వెసులుబాటా? లేదా, ఏ భక్తులు ఆసక్తి చూపించినా.. వారికి అవకాశం కల్పిస్తారా? అని పలువురు సందేహిస్తున్నారు. ఒక సెలబ్రిటీ భార్యగా వసుంధర అన్నం వడ్డించే కార్యక్రమంలో పాల్గొనడంతో.. ఒక్కసారిగా చాలా మంది భక్తుల దృష్టి దీనిపై పడింది. ఇలాంటి అవకాశం దక్కితే.. స్వామి వారి భక్తులకు వడ్డించే భాగ్యంతో జన్మ తరిస్తుందని పలువురు అంటున్నారు. అయితే.. ఆమె వీఐపీ గనుక అనుమతించారని.. అందరికీ దక్కే ఛాన్సు కాదని ఆలయ వర్గాల ద్వారా తెలుస్తున్నది.