టీడీపీ పగ్గాలు తారక్ కు ఇవ్వాలన్న ఏపీ మంత్రి

Update: 2021-03-16 04:55 GMT
తెలుగుదేశం అన్నా.. చంద్రబాబు అన్నా ఏ మాత్రం ఇష్టపడని కరడుకట్టిన వైసీపీ నేతల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకరు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడిగా.. పార్టీ కోసం దేనికైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరించే ఆయనకు.. విపక్ష తెలుగుదేశం మీద అంతులేని జాలి వచ్చేసినట్లుగా కనిపిస్తోంది. తాజాగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో దారుణ ఓటమిని ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘‘మున్సిపల్ ఎన్నికలతో తెలుగుదేశం పార్టీ ఏపీలో ఖతమైంది. టీడీపీ పూర్తిగా చచ్చిపోయింది. కాస్త అయినా టీడీపీ నిలదొక్కుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే సాధ్యమవుతుంది’’ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన మరిన్ని వ్యాఖ్యలు చేశారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవటానికే గుంటూరు..  కృష్టా ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేశారని అక్కడి ప్రజలకు అర్థమైందన్నారు మంత్రి బాలినేని. ఈ విషయాన్నిగుర్తించిన రాజధాని ప్రాంత వాసులు వైసీపీకి అద్భుతమైన విజయాన్ని అందించినట్లుగా పేర్కొన్నారు. లోకేశ్ వల్ల టీడీపీకి ఎలాంటి లాభం ఉండదన్న ఆయన.. బాబు పని అయిపోయినట్లుగా తేల్చేశారు.

టీడీపీ నేతలు.. కార్యకర్తలకు జూనియర్ ఎన్టీఆరే ఆశాదీపంలా కనిపిస్తున్నారన్నారు. ఏళ్లకు ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతున్న పలువురు.. వైసీపీలో జాయిన్ అయినట్లుగా వెల్లడించారు. మొత్తానికి ప్రత్యర్థి పార్టీ పగ్గాలు ఎవరి చేతుల్లోకి వెళ్లాలన్న విషయాన్ని సైతం వైసీపీ మంత్రే డిసైడ్ చేస్తారా? అని టీడీపీ నేతలుతీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News