కేసీఆర్‌ ని ఫ‌స్ట్ టైం ఘోరంగా తిట్టాడు

Update: 2018-03-02 06:22 GMT
అన్ని బాగున్న‌ప్పుడు ఒక మాట ఎక్కువ త‌క్కువ అన్నా న‌డిచిపోతుంది. కానీ.. మాట తేడా వ‌చ్చిన‌ప్పుడే ఇబ్బంది అంతా. త‌మ నాయ‌కుడ్ని ఇంద్రుడు.. చంద్రుడు అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కొలుస్తున్న వేళ క‌మ్మ‌గా ఎంజాయ్ చేసిన క‌మ‌ల‌నాథుల‌కు ఇప్పుడు మాత్రం ర‌గిలిపోతున్నారు. మోడీగాడు అంటూ కేసీఆర్ నోటి నుంచి వ్యాఖ్య‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌ధాని లాంటి అత్యుత్త‌మ ప‌ద‌విలో ఉన్న నేత‌పై ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి అంత దారుణ వ్యాఖ్య‌లు చేస్తారా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఆ మాట‌కు వ‌స్తే తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మ వేళ‌లో కూడా నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ ను ఉద్దేశించి ఏక‌వ‌చ‌నంతో మాట తూల‌టం మ‌ర్చిపోకూడ‌దు.

త‌న‌కు న‌చ్చితే నెత్తిన పెట్టుకోవ‌టం.. న‌చ్చ‌కుంటే పురుగు కంటే హీనంగా తీసి పారేయ‌టం కేసీఆర్‌కు అల‌వాటు. నిత్యం ఆత్మ‌గౌర‌వ నినాదాన్ని ప్ర‌స్తావించే ఆయ‌న‌కు.. త‌న‌కు మాదిరే మిగిలిన వారికి ఆత్మ‌గౌర‌వం ఉంటుంద‌న్న విష‌యాన్ని ఆయ‌న మ‌ర్చిపోతార‌నిపించ‌క‌మాన‌దు. ఒక దేశ ప్ర‌ధానిని ఉద్దేశించి ఆయ‌న అంత దారుణంగా వ్యాఖ్యానించిన నేప‌థ్యంలో క‌మ‌ల‌నాథులు ఇప్పుడు క‌స్సుమంటున్నారు.

ఇంత‌కాలం త‌మ‌ను అప్పుడ‌ప్పుడు మాట‌ల‌తో పోట్లు పొడుస్తున్నా పెద్ద‌గా ప‌ట్టించుకోని క‌మ‌ల‌నాథుల‌కు.. తాజాగా త‌మ నేత మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లపై క‌స్సు మంటున్నారు. కేసీఆర్ పై మాటాస్త్రాల్ని సంధిస్తున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న‌ప్పుడు నిత్యం కేసీఆర్ తో ఉన్న బండారు ద‌త్తాత్రేయ సంగ‌తే చూస్తే.. ఇప్పుడాయ‌న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిని ద‌ద్ద‌మ్మ‌గా ఫైర్ అయ్యారు. ఎందుకన్న ప్ర‌శ్న వేసే అవ‌కాశం ఇవ్వ‌కుండానే కార‌ణం చెప్పేశారు. ల‌క్ష‌న్న‌ర కోట్ల రాష్ట్ర బ‌డ్జెట్ లో వ్య‌వ‌సాయానికి రూ.10వేల కోట్లు కేటాయించ‌లేని ద‌ద్ద‌మ్మ‌లు కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తారా? అని ఆయ‌న మండిప‌డ్డారు.

ఈ కోపాన్ని కాసేపు ప‌క్క‌న పెడితే.. ఇక్క‌డో డౌట్ రాక మాన‌దు. బ‌డ్జెట్ పెట్టింది గ‌త ఏడాది ఏప్రిల్ లో. మ‌రి.. అందులోని లోపాన్ని ఇప్పుడు ఎత్తి చూపించ‌టం ఏమిటి? అంటే.. త‌మ వాళ్ల‌ను తిడితే కానీ కేసీఆర్ స‌ర్కారు చేసే త‌ప్పులు క‌నిపించ‌వా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఇదొక్క‌టే కాదు.. ద‌త్త‌న్న మొద‌టి నుంచి ఇలానే వ్య‌వ‌హ‌రించేవారు. కేంద్ర మంత్రిగా ఉన్న వేళ‌.. ద‌త్త‌న‌ను త‌మ నాయ‌కుల‌తో క‌లిసిన కేసీఆర్‌.. తెలంగాణ‌కు ఢిల్లీలో పెద్ద దిక్కుగా అభివ‌ర్ణించ‌టం.. ఆ మాట‌లు విని పొంగిపోవ‌టం తెలిసిందే. అలాంటి ద‌త్త‌న్న ఈ రోజు కేసీఆర్ ను తిట్టేస్తే ఎఫెక్ట్ ఉంటుందా? అన్న‌ది ప్ర‌శ్న‌.
Tags:    

Similar News