అదేంది దత్తన్న అలా మాట్లాడేశావ్..?

Update: 2016-09-24 06:17 GMT
అదృష్టమంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దే. ఇప్పుడున్న దూకుడు రాజకీయాల్లో సొంత పార్టీవాళ్లే అప్పుడప్పడు తమ సర్కారుపై విమర్శలు చేస్తున్న రోజులివి. అలాంటిది తమకేమాత్రం సంబంధం లేని పార్టీ విషయంలో కేంద్రమంత్రి స్థాయిలో ఉన్న నేత వెనకేసుకురావటం ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలంలో తెలంగాణ అధికారపక్షానికి..బీజేపీకి మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే వరంగల్ లో నిర్వహించిన బారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మరీ తెలంగాణ రాష్ట్ర సర్కారుపైనా.. ముఖ్యమంత్రి తీరు మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తటం తెలిసిందే. 2019లో తాము తప్పనిసరిగా అధికారంలోకి వస్తామని.. వచ్చిన వెంటనే తామేం చేస్తామన్న విషయాల్ని సైతం బీజేపీ చీఫ్ అమిత్ షా చిట్టా విప్పారు. ఊహించనిరీతిలో అమిత్ షా విరుచుకుపడిన తీరుతో ఉలిక్కిపడిన టీఆర్ ఎస్ వర్గాలు.. ఒకరి తర్వాత ఒకరుగా మాటల యుద్ధాన్ని షురూ చేశారు. కేంద్రంలో కొలువు తీరిన ప్రధాన రాజకీయ పక్షమన్న విషయాన్ని పట్టించుకోకుండా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

దీనికి ప్రతిగా తెలంగాణ బీజేపీ నేతలు సైతం రియాక్ట్ అయి..కౌంటర్ అటాక్ షురూ చేశారు. ఇదిలా సాగుతుంటే.. కేంద్రమంత్రి.. తెలంగాణ బీజేపీ సీనియర్ నేత అయిన బండారు దత్తాత్రేయ మాత్రం ఈ ఎపిసోడ్ తో తనకేమాత్రం సంబంధం లేనట్లుగా ఉండిపోయారు. సొంత పార్టీ చీఫ్ ను తెలంగాణ అధికారపక్షం అన్నేసి మాటలు అంటున్నా ఆయన స్పందించక పోవటంపై తెలంగాణ బీజేపీ వర్గాలు గుర్రుగా ఉన్నాయి.

ఇదిలాఉంటే.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తమవుతోంది. అతి భారీ వర్షాలతో తెలంగాణ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం గజగజలాడిపోతోంది. కట్టలు తెగిన నాలాలు.. చెరువులతో హైదరాబాద్ లోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధనంలో చిక్కుకుపోయాయి. కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వర్షాలపై మాట్లాడిన బండారు దత్తాత్రేయ.. హైదరాబాద్ లో ప్రస్తుతం చోటు చేసుకున్న వరదలకు గత పాలకుల నిర్లక్ష్యమే కారణంగా అభివర్ణించారు. హైదరాబాద్ నగరంలో కేంద్ర బృందం తక్షణమే పర్యటించి విపత్తు సహాయాన్ని అందించేలా చూస్తానని వ్యాఖ్యానించారు. నగరంలో35 ఏళ్ల తర్వాత ఈ తరహా వరదలు వచ్చాయని.. గతంలో కిర్లోస్కర్ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేసి ఉంటే ఇలాంటి ఇబ్బంది ఉండేది కాదన్నారు. 2004లో కిర్లోస్కర్ కమిటీ నివేదిక ఇచ్చినప్పుడే కానీ అమలు చేసి ఉంటే రూ.2వేల కోట్లతో పూర్తి అయ్యేదని.. ఇప్పుడదే అమలు చేయాలంటే రూ.20వేల కోట్లు కావాలన్నారు.

గత ప్రభుత్వాల్ని తప్పు పట్టే దత్తన్న.. తెలంగాణ సర్కారు కొలువు తీరి రెండున్నరేళ్లు కావొస్తుందని.. ఇంత కాలం తర్వాత కూడా గత ప్రభుత్వ లోపాలంటూ అధికారపార్టీ మాట్లాడినట్లుగా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఓపక్క తమ పార్టీ చీఫ్ ను విమర్శలతో తెలంగాణ అధికారపక్షం విరుచుకుపడుతున్నా స్పందించని దత్తాత్రేయ.. అదే తెలంగాణ సర్కారుపై విమర్శలు వస్తున్న వేళ.. వారికి అండగా ఉన్నట్లు వెనకేసుకురావటం ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News