కశ్మీర్ ను పాతబస్తీని భలేగా లింకేసిన బండి సంజయ్

Update: 2022-04-03 09:36 GMT
సాధారణంగా పండుగ రోజుల్లో రాజకీయ కార్యకలాపాలు.. వేడి పుట్టించే వ్యాఖ్యలు కాస్త తక్కువగా ఉంటాయి. అందుకు భిన్నంగా తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది వేళ.. రొటీన్ కు భిన్నమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. పండుగ జోష్ కంటే కూడా రాజకీయ శత్రుత్వం అడుగడుగునా కనిపించింది. ఎవరికి వారు.. తమకొచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా తమ ప్రత్యర్థులపై విరుచుకు పడేందుకు వెనుకాడలేదు.

అక్కడెక్కడో సుదూరాన ఉన్న కశ్మీరాన్ని.. హైదరాబాద్ పాతబస్తీని లింకేసిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాదం వల్ల కశ్మీర్ ఎలా అయితే దెబ్బ తిన్నదో.. మజ్లిస్ పార్టీ కారణంగా పాతబస్తీ అంతే నష్టపోయిందన్నారు. ఒవైసీలకు భయపడి పాతబస్తీకి మంజూరైన మెట్రో రైలు మార్గాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డుకున్నారన్నారు. రోహింగ్యాలు.. తీవ్రవాదులకు అడ్డాగా మారిన పాతబస్తీ ప్రజల జీవితాన్ని ఛిద్రం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

నియంత కేసీఆర్ పాలనతో తెలంగాణ ప్రజలు అత్యంత కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారన్నారు. కుటుంబ పాలన.. నియంత పాలన.. అవినీతి పాలనతో ప్రజలకు కష్టాలు తప్పట్లేదన్న బండి.. తీవ్రవాదాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సమర్థించే పార్టీలన్నీ తన వరకు దేశ ద్రోహ పార్టీలేనని పేర్కొన్నారు.

తీవ్రవాదం వల్ల కశ్మీర్ ప్రజలు ఎంతలా నష్టపోయారో.. తీవ్రవాదులు ఎంతటి నరమేధానికి పాల్పడ్డారో కళ్లకు కట్టినట్లుగా కశ్మీర్ ఫైల్స్ సినిమా చూపించిందన్నారు. లౌకికవాద ముసుగులో ఈ సినిమాను వ్యతిరేకిస్తున్న వాళ్లంతా దేశ ద్రోహులకు మద్దతు ఇస్తున్నట్లేనని.. అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఏమైనా కశ్మీర్ ను.. హైదరాబాద్ పాతబస్తీని లింకేసి.. తమ రాజకీయ ప్రత్యర్థి అయిన మజ్లిస్ ను.. దాని మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న తెలంగాణ అధికారపక్షానికి పంచ్ లు వేసేలా బండి సంజయ్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మరి.. బండి వ్యాఖ్యలపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.
Tags:    

Similar News