బండి సంజయ్ మెడకు చలానా చిక్కుకుందే?

Update: 2020-11-21 12:30 GMT
ఐడియా ఎవరిచ్చారో కానీ.. ఏ మాత్రం ఆలోచన లేకుండా.. బాధ్యత లోపించినట్లుగా మాట్లాడిన మాటలు ఇప్పుడు విమర్శలకు తావిస్తున్నాయి. నిజానికి ముఖ్యమైన విషయాన్ని ఆలోచన లేకుండా తొందరపాటుగా మాట్లాడి అడ్డంగా బుక్ అయ్యారు బండి సంజయ్. హైదరాబాద్ మహానగర పోలీసులు విధించే చలానాల మీద చాలామందికి అభ్యంతరాలు ఉంటాయి. ట్రాఫిక్ నియంత్రణ కంటే కూడా అర్థం పర్థం లేని రీతిలో చలానాలు విధిస్తారన్న విమర్శ పలువురి నోట వినిపిస్తుంటుంది.

అలాంటి అంశాన్ని ప్రస్తావించే వేళ.. అప్రమత్తంగా ఉండాలి. ఉదాహరణలు చూపించాలి. తాము చెప్పే విషయాన్ని క్లారిటీగా చెప్పటమే కాదు.. వేలెత్తి చూపించే అవకాశాన్ని అస్సలు ఇవ్వకూడదు. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరించిన బండిసంజయ్ తాజాగా అడ్డంగా బుక్ అయ్యారు. ట్రిపుల్ రైడింగ్ కు వేసే చలానాలు మొత్తాన్ని తాము అధికారంలోకి వస్తే తీసేస్తామని చెప్పటానికి మించిన తప్పు మరొకటి లేదనే చెప్పాలి.

ట్రాఫిక్ నిబందనల్ని ఉల్లంఘించిన వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని అందరూ కోరుతుంటే.. అందుకు భిన్నంగా మాట్లాడిన బండిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. హైదరాబాద్ లో చటాన్లు కడతామని చెబుతున్నారని.. అమ్మకు అన్నం పెట్టనోడు.. చిన్నమ్మకు బంగారం ఇస్తానన్నట్లు ఉందని పంచ్ లు వేస్తున్నారు మంత్రి కేటీఆర్. గుజరాత్.. మధ్యప్రదేశ్.. కర్ణాటకల్లో చలాన్లు మీరే కడుతున్నారా? అంటూ సంధిస్తున్న ప్రశ్నలు బీజేపీ నేతలకు ఇబ్బందికి గురి చేసేవే.

ప్రత్యర్థులపై ఆవేశం మంచిదే. కానీ.. అదేదీ తమకు తిప్పలు తెచ్చి పెట్టేలా ఉండకూడదన్న ప్రాథమిక సూత్రాన్ని బండి సంజయ్ గుర్తు పెట్టకోవాలంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి.. బీజేపీనేతల నోటి నుంచి వచ్చే మాటల మీద చాలా జాగ్రత్తగా గమనిస్తోంది గులాబీ దళం. వారి నోటినుంచి వచ్చే మాటల్లో తేడా మాట చిన్నది కనిపించినా దాన్ని పీకి పాకాన పెడుతూ.. హైలెట్ చేస్తు ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు. చలానాల యవ్వారం గులాబీ నేతలకు చేతికి అందివచ్చిన అస్త్రంగా మారిందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
Tags:    

Similar News