ఢిల్లీలో కేసీఆర్ ఏం చెప్పారో చెప్పిన బండి

Update: 2021-01-03 10:30 GMT
గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత.. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేపట్టిన బంద్ ను దగ్గరుండి నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వ వైఖరి సంచలనంగా మారింది. ఇలాంటివేళ.. ఊహించని రీతిలో హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను.. ప్రధాని మోడీని కలవటం.. వారితో ఏకాంత భేటీలు జరపటం తెలిసిందే. అనంతరం హైదరాబాద్ కు వచ్చిన ఆయన.. ఆ తర్వాత ఫాంహౌస్ కు వెళ్లిపోయి దాదాపు పదమూడు రోజుల పాటు అక్కడే ఉండటం తెలిసిందే.

ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నుంచి అదే పనిగా నిర్ణయాలు తీసుకోవటంతో పాటు..గతంలో తీసుకున్న సంచలన నిర్ణయాల్ని వెనక్కి తీసేసుకుంటున్నారు. ఏదైనా విషయం మీద ఒకసారి ఫిక్స్ అయితే.. ఎంతకూ వెనక్కి తగ్గరన్న పేరున్న కేసీఆర్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కాలంలో చాలామంది మదిలో మెదులుతున్న సందేహం.. ఢిల్లీలో అసలేం జరిగిందని. అయితే.. ఈ విషయంపై వివరాలు పెద్దగా బయటకు రాలేదు.

ఇలాంటివేళ.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు సస్పెన్స్ గా ఉన్న కేసీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఏం జరిగిందన్న విషయాన్ని చెప్పి హాట్ టాపిక్ గా మారారు. ఆయన చెప్పినట్లు నిజంగానే జరిగిందా? అలాంటి వాటికి అవకాశం ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ బండి రివీల్ చేసిన ఆ అంశంలోకి వెళితే.. సీఎం పదవి లేకున్నా సరే.. తనను.. తన కుటుంబాన్ని జైలుకు పంపొద్దని కేసీఆర్ కోరినట్లుగా బండి వ్యాఖ్యానించారు.

పొర్లు దండాలు పెట్టినా సరే.. సీఎం కేసీఆర్ ను.. ఆయన కుటుంబాన్ని క్షమించే ప్రసక్తే లేదన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల్ని కాపాడుకోవటానికి బీజేపీ.. టీఆర్ఎస్ పొత్తు ఉందని తప్పుడు సంకేతాలు ఇస్తున్నారన్నారు. సిగ్గు.. బుద్ధి ఉన్న వారెవరూ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోరన్నారు. బండి నోటి నుంచి వచ్చిన తాజా మాటలపై కేసీఆర్ కానీ ఆయన కుటుంబ సభ్యులు.. మేనల్లుడితో సహా ఎవరైనా స్పందిస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News