కొడుకు కరాటే మాష్టారి కోసం ఇంట్లోనే చోరీ?

Update: 2017-03-04 10:05 GMT
వినటానికే వింతగా ఉన్నా ఇది నిజం. గార్డెన్ సిటీలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొడుకు కరాటే మాష్టారి కోసం సొంతింట్లో రూ.30లక్షల మేర దొంగతనం చేసేసిన వైనాన్ని పోలీసులు గుర్తించటమే కాదు.. ప్రస్తుతం ఆమెను కటకటాల వెనక్కి పంపారు. సంచలనంగా మారిన ఈ ఉదంతం పోలీసులకు షాకుల మీద షాకులిస్తోంది. బెంగళూరులోని శాంతినగర్ కు చెందిన 30 ఏళ్ల కావ్య విశ్వనాథన్.. ఇంట్లో చోరీ జరిగినట్లుగా భర్తకు చెప్పింది.

కావ్య మినహా.. ఇంట్లోని కుటుంబ సభ్యులు ఒక శుభకార్యానికి వెళ్లిన వేళ.. ఇంటికి వచ్చిన మహిళలు కొందరు తనకు మత్తు ముందు ఇచ్చినట్లుగా పేర్కొంది. ఒక వేడుకకు ఆహ్వానించేందుకు ఇన్విటేషన్ కార్డు ఇవ్వటానికి వచ్చామన్న మహిళలు కొందరిని తాను ఇంట్లోకి అనుమతించానని.. వారు తనకేదో మత్తుమందు ఇచ్చారని.. దీంతో స్పృహ కోల్పోయానని.. తర్వాత చూస్తే.. ఇంట్లో పెద్ద ఎత్తున బంగారం.. నగదు పోయిన విషయాన్ని గుర్తించినట్లుగా చెప్పి బోరుమంది. దీంతో ఆమె భర్త.. జరిగిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు.. కావ్యపైన ఎలాంటి దాడి జరగలేదని.. ఆమెపై ఎలాంటి మత్తు మందును చల్లలేదన్న విషయాన్ని గుర్తించారు. విచారణలో భాగంగా కావ్య చెబుతున్న సమాధానాలు పొంతన లేకుండా ఉండటం.. సందేహాలకు తావిచ్చేలా ఉండటంతో పోలీసులు మరింత దృష్టిని పెట్టారు. ఈ నేపథ్యంలో కావ్య విశ్వనాధన్ మాటల్లో కొడుకు కరాటే టీచర్ మహబూబ్ పాషా గురించిన వివరాలు బయటకు వచ్చాయి. దీంతో.. వీరిద్దరిని వేర్వేరుగా విచారించిన పోలీసులు.. అసలు గుట్టును బయటకు తీశారు.

దొంగతనం జరిగిందన్నది డ్రామా అని.. కావ్య విశ్వనాథనే.. తన ఇంట్లోనే తను చోరీ చేసినట్లుగా గుర్తించారు.కొడుకు కరాటే మాష్టారికి ఇచ్చేందుకు ఈ నాటకమంతా ఆడినట్లుగా తేల్చారు. కొడుక్కిమంచి భవిష్యత్తు ఉంటుందని.. కరాటేలో మంచి శిక్షణ ఇచ్చేందుకు వీలుగా తాను బంగారాన్ని ఇచ్చినట్లుగా కావ్య పేర్కొన్నారు. దీంతో.. కావ్యను.. ఆమెకొడుకు కరాటే మాష్టారు ఇద్దరిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఈ ఉదంతంపై మరింత సమాచారం కోసం విచారణ జరుపుతున్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరిగితే.. మరెన్ని షాకింగ్ విషయాలు బయటకువస్తాయా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News