ఆ రూల్ చెప్పి బ్యాంకుల దోపిడీ 5వేల కోట్లు!

Update: 2018-08-06 05:40 GMT
కొన్ని రూల్స్ చిత్రంగా ఉంటాయి. వాటి ఆధారంగా కొన్ని వ్య‌వ‌స్థ‌లు వ్య‌వ‌హ‌రించే తీరు ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంటాయి. ప‌లు ప్ర‌భుత్వ‌.. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు తాము చేసే త‌ప్పుల‌కు ఎలాంటి మూల్యం చెల్లించ‌వు. అదే స‌మ‌యంలో.. వారు అందించే సేవ‌ల్ని వినియోగించుకునే విష‌యంలో ప్ర‌జ‌లు త‌ప్పులు చేస్తే మాత్రం భారీగా మూల్యం చెల్లించేలా ఫైన్ల షాకులు ఇస్తుంటారు.

తాజాగా అలాంటి లెక్క ఒక‌టి తెర మీద‌కు వ‌చ్చింది. బ్యాంకు ఖాతాల్లో క‌నీస (మినిమం) బ్యాలెన్స్ నిర్వ‌హించ‌టం లేద‌న్న సాకు పేరుతో వినియోగ‌దారుల నుంచి బ్యాంకులు దోపిడీ చేసిన మొత్తం లెక్క వింటే అవాక్కు అవ్వాల్సిందే. బ్యాంకులో అకౌంట్ తెరిచి.. దాన్లో ఉంచాల్సిన మినిమం బ్యాలెన్స్ ను ఉంచ‌ని ఖాతాల‌కుచెందిన మొత్తాన్ని ఏడాది వ్య‌వ‌ధిలో వ‌సూలు చేసిన జ‌రిమానా ఎంతో తెలుసా?  అక్ష‌రాల రూ.5వేల కోట్ల‌కు పైనే.

షాకింగ్ గా అనిపించినా ఇది నిజం. బ్యాంకు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ మొయింటైన్ చేయ‌టం లేద‌న్న పేరుతో దేశంలోని 21 ప్ర‌భుత్వ బ్యాంకుల‌తో పాటు.. మూడు మేజ‌ర్ ప్రైవేటు బ్యాంకులు 2017-18 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఖాతాదారుల నుంచి జ‌రిమానాల రూపంలో వ‌సూలు చేసిన మొత్తం రూ.5వేల కోట్ల‌కు పైనే. ఇందులో భారీ ఎత్తున ఫైన్ వ‌సూలు చేసిన ఘ‌న‌త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదే.

ఈ ప్ర‌భుత్వ రంగ బ్యాంకు త‌న వినియోగ‌దారుల నుంచి మినిమం రూల్ మీద ఫైన్ల రూపంలో వ‌సూలు చేసింది రూ.2433.87 కోట్లు.  త‌ర్వాతి స్థానంలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు నిలిచింది. ఈ బ్యాంకు రూ.590.84 కోట్లు వ‌సూలు చేశాయి. ఇక‌.. ఇదే రీతిలో ఖాతాదారుల నుంచి దోపిడీ చేసిన బ్యాంకుల్లో యాక్సిస్ రూ.530.12 కోట్లు.. ఐసీఐసీఐ రూ.317.6 కోట్ల‌ను ఫైన్ల రూపంలో వ‌సూలు చేసిన‌ట్లుగా తేలింది. చిన్న పొర‌పాటుకు ప్ర‌జ‌లు చెల్లించే భారీ మూల్యం ఎంతో అర్థ‌మైందిగా!

Tags:    

Similar News