‘‘బ్యాంకు ముందు నడిస్తే ఛార్జ్ వేస్తే సరి’’

Update: 2017-03-07 06:59 GMT
ఇష్టారాజ్యంగా ఛార్జీల బాదుడుపై కడుపు మండిన సగటు వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్య ఇది. బ్యాంకుల్లో డబ్బులు జమ చేయటమే నేరంగా.. వేసిన డబ్బుల్ని తీసుకోవటం మహాపరాధమన్నట్లుగా బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరు చూసిన సగటుజీవి కడుపు మండిపోతోంది. అర్థంపర్థం లేని రూల్స్ పెట్టేసి.. అమాయకజీవుల మీద విపరీతమైన భారాన్ని మోపేందుకు ప్రైవేటు బ్యాంకులు నిర్ణయం తీసుకోవటం.. అదే బాటలో ఎస్ బీఐ నడస్తానంటూ ప్రకటించటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజలు దాచుకున్న సొమ్మును.. కంపెనీలకు.. బడాబాబులకు వెనుకా ముందుచూసుకోకుండా వేలాది కోట్ల రూపాయిలు రుణాలివ్వటం.. వారు చేతులెత్తేస్తే.. గుట్టు చప్పుడు కాకుండా రైటాఫ్ చేసే బ్యాంకులు.. సామాన్యుడు రెండుసార్లు బ్యాంకుల్లో డబ్బులు వేసినా.. మూడుసార్లకు మించి డబ్బులు విత్ డ్రా తీసుకున్నా.. ఛార్జీల పేరుతో వాయించేస్తామన్న రీతిలో జారీ చేసి ఛార్జీల లిస్టు చూసిన వారికి కడుపు మండిపోతోంది.

నగదు లావాదేవీల్ని తగ్గించాలన్నదే లక్ష్యమనుకొని.. కార్డులతో సరిపుచ్చుకుందామన్నా.. వాటిపైనా పరిమితులు విధించిన వైనంపై మండిపాటు వ్యక్తమవుతోంది. ఇక ఆన్ లైన్ బ్యాలెన్స్ బదిలీపై ఇప్పటికే వాయించేస్తున్న వైనంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బ్యాంకుల్లో జమ చేసే మొత్తంలో చాలావరకూ పన్ను చెల్లించిన మొత్తమే ఉంటుంది. ఆదాయపన్ను నుంచి వివిధ రకాల పన్నులు చెల్లించిన తర్వాత దాచిపెట్టుకునే సొమ్ము మీద కూడా ఛార్జీలు వేయటం ఏమిటన్న మండిపాటే కాదు.. బ్యాంకుల ముందు నడిచి వెళితే కూడా ఛార్జీలు వేసేస్తే పోలా? అన్న వ్యంగ్య వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

శాలరీ అకౌంట్లున్న వారు తమ డెబిట్ కార్డులతో చెల్లింపులు జరపాలన్నా అదనపు భారం పడటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏదైనా షాపుల వద్దకు వెళ్లినప్పుడు డెబిట్ కార్డుల మీద కూడా ఒక శాతం  నుంచి రెండు శాతం వరకూ ఛార్జీల రూపంలో బాదేస్తున్నారు. మొత్తంగా పరిస్థితి ఎలా ఉందంటే.. బ్యాంకుల్లో డబ్బులు వేసి ఉంచటం పాపం అన్నట్లుగా మారింది. వచ్చిన మొత్తాన్ని వచ్చినట్లుగా డ్రా చేసేసుకొని చేతిలో ఉంచుకుంటే మంచిదన్నట్లుగా మారింది. ఒకవైపు నగదురహిత లావాదేవీలు చేయాలంటూ ప్రభుత్వం ప్రచారం నిర్వహిస్తుంటే.. మరోవైపు బ్యాంకు లావాదేవీలపై ఛార్జీలు విధిస్తున్న బ్యాంకు వైఖరితో.. అందరూ ఇళ్లల్లోనే డబ్బులు దాచుకునే అవకాశం ఉంటుందన్న వాదన వినిపిస్తుంది. అదే జరిగితే కొత్త సమస్యలు తెరపైకి రావటం ఖాయం. ఇప్పటికైనా బ్యాంకుల ఛార్జీల బాదుడుపై మోడీ సర్కారు స్పందించాల్సిన అవసరం ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News