నోట్ల రద్దుపై బ్యాంకులకు ముందే సంకేతాలు..?

Update: 2016-11-15 05:04 GMT
పెద్దనోట్ల రద్దుపై ప్రధాని మోడీ చేసిన సంచలన ప్రకటనతో బ్యాంకుల వద్ద.. ఏటీఎంల వద్ద నెలకొన్న రద్దీ సంగతి తెలిసిందే. నోట్ల రద్దుపై మోడీ ప్రకటన చేసి నేటికి ఏడు రోజులు అవుతున్నా.. బ్యాంకుల వద్ద క్యూ లైన్లు అంతకంతకూ పెరుగుతున్నాయే కానీ తగ్గని పరిస్థితి. రోజువారీ అవసరాల కోసం ఇంతకాలం వెయిట్ చేస్తున్న వారు సైతం తాజాగా క్యూలైన్లకు చేరుకుంటున్న వేళ.. ఏటీఎం.. బ్యాంకు సేవలకు మరిన్ని గంటలు ఖర్చుచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నోట్ల రద్దుపై కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరించలేదని.. రద్దు నిర్ణయం అనంతర పరిస్థితుల్ని మదింపు చేయటంలో మోడీ సర్కారు అట్టర్ ఫ్లాప్ అయ్యారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నోట్ల రద్దు నేపథ్యంలో రూ.100 నోట్లు విస్తృతంగా లభించేలా కేంద్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. జాగ్రత్తలు తీసుకున్న విషయం అర్థమవుతుంది. నేరుగా కాకున్నా పరోక్షంగా.. వంద నోట్లను వీలైనంత ఎక్కువగా సమకూర్చుకోవాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసినవైనం వెలుగులోకి వచ్చింది. నోట్ల రద్దుపై బ్యాంకులకు పరోక్ష సంకేతాల్ని అందించిన వైనం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

స్వచ్ఛ నోట్ల విధానంలో భాగంగా పలు సూచనలు చేసిన కేంద్రం చిల్లర వర్తకం అవసరాలుతీర్చేలా రూ.100 నోట్లనుఅధికంగా సరఫరా చేయాలని కోరటమే కాదు.. ప్రయోగాత్మకంగా 10 శాతం ఏటీఎంలలో కేవలం రూ.100 నోట్లు వచ్చేలా మాత్రమే ఏర్పాటు చేయాలని కోరటం కనిపిస్తుంది. అయితే.. ఈ పైలెట్ ప్రాజెక్టును ఎన్ని బ్యాంకులు అమలు చేశాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. రూ.100 ఇంకా తక్కువ నోట్ల విలువ ఉన్ నోట్లు ఏటీఎంలు ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలన్న సూచనను చేసినా.. వాటిని అమలు చేసిన బ్యాంకులు తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ నెల రెండో తేదీన విడుదల చేసిన ఆదేశాన్ని చూస్తే.. దేశ వ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో 20 శాతం లేదా.. 20వేల ఏటీఎంలలో కేవలం రూ.100 నోట్లు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందుకు 15 రోజుల గడువును ఇచ్చారు. అయితే.. అనూహ్యంగా ఈ నెల ఎనిమిదో తేదీన.. అంటే గడువు ముగియటానికి ఏడురోజులు ముందే పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లుగా ఆదేశాలుజారీ చేయటం గమనార్హం.

పెద్దనోట్లను రద్దు నిర్ణయాన్ని ప్రకటించటానికి కొన్ని నెలల ముందు (మే నెలలోనే) ఆర్ బీఐ ఒక సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం చిన్ననోట్ల ఏటీఎంలను ఏర్పాటు చేయటానికి అవసరమైన మొత్తంలో సగం ఖర్చును తాము ఇవ్వటానికి సిద్ధమేనని పేర్కొంది. అయితే.. ఈ సూచనను బ్యాంకులు పెద్దగా పట్టించుకున్నట్లుగా లేదని చెప్పాలి. ఈ వ్యవహారాల్ని చూస్తే.. నోట్ల రద్దుపై ముందస్తుగానే కసరత్తు జరిగింది. నోట్లరద్దుకు సంబంధించిన నిర్ణయాన్ని తాము అనుకున్నట్లుగా ప్రకటించిన ప్రభుత్వ పెద్దలు.. రద్దు తర్వాత ఏర్పడే పరిస్థితుల్ని మదింపు చేయటంతో అంచనాలు తప్పినట్లుగా చెప్పక తప్పదు. ఒకవేళ.. ముందుస్తుగా తీసుకున్న జాగ్రత్తల్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసి.. తాము చెప్పినట్లుగా బ్యాంకులు మార్పులు చేర్పులు చేస్తున్నాయా? లేదా? అన్న అంశాన్ని చెక్ చేసి ఉంటే ఈరోజు ప్రజలకు ఇన్ని కష్టాలు ఉండేవి కావేమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News