ఇవాళ్టి నుంచి మీ జేబు దోపిడికి గుర‌వుతుంది

Update: 2017-04-01 05:44 GMT
న్యాయ‌బ‌ద్ద‌మైన దోపిడి. ఇదో కొత్త ప‌దం. సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న ప‌దం. మ‌న అనుమ‌తి లేకుండా, చ‌ట్టానికి - న్యాయానికి వ్య‌తిరేకంగా చేసే ప‌నిని దోపిడి అయితే...మ‌న అవ‌స‌రాల ప్రాతిపదిక‌న, అనుమ‌తితో పూర్తి చ‌ట్ట‌బ‌ద్దంగా జేబులు గుల్ల చేస్తున్న తీరుకు `న్యాయ‌బ‌ద్ద‌మైన దోపిడి` అని నెటిజ‌న్లు పేరు పెట్టారు. ఎందుకంటే నేటి నుంచి సర్వీసు చార్జీల మోత...బ్యాంకు లావాదేవీల కోత..పెనాల్టీల వాత..ఇదీ నేటి నుంచి అమలులోకి వస్తున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో దేశ ప్రజలు ఎదుర్కోబోయే పరిస్థితి కాబ‌ట్టి ఈ పేరును ఖ‌రారు చేశారు.

ఎన్నో మార్పులు, చేర్పుల కలయికగా కూడా 2017-18 ఆర్థిక సంవత్సరం అలరించబోతోంది. నగదు లావాదేవీలు మరింత భారమే కానున్నాయి. దాదాపుగా అన్ని బ్యాంకులు అదనపు చార్జీల వసూలు మొదలు పెట్టేశాయి. అసలే పెద్ద నోట్ల రద్దుతో కకాయికలై చేతిలో నగదు ఆడక  అల్లాడుతున్న జనానికి ఈ కొత్త వాతలు, మోతలు మరింత ఇబ్బంది కలిగించేవే! కొత్త సర్వీసులు అందుబాటులో ఉన్నాయన్న ఆనందం కంటే వాటికి అదనపు చార్జీలు చెల్లించాలన్న ఆందోళన జనానికి నిద్ర పట్టనివ్వడం లేదు. ఏ బ్యాంకు ఎప్పుడు ఎలాంటి భారం వేస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే హెచ్‌ డిఎఫ్‌ సి - ఐసిఐసిఐ - యాక్సిస్ వంటి ప్రైవేటు బాంకులు నగదు లావాదేవీలపై చార్జీలు వేశాయి. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అతి పెద్ద బ్యాంక్ అయిన ఎస్‌ బిఐ కూడా అనేక రకాల సర్వీసులకు అదనపు వసూళ్లు చేయబోతోంది. ఈ బ్యాంకు ఖాతాదారులకు మూడుసార్లు ఎలాంటి చార్జీలు లేకుండా నగదు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ పరిమితి దాటితే 50 రూపాయలు - సర్వీసు పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఆయా పట్టణాలను బట్టి 1000 నుంచి 5వేల వరకూ ఉంటుంది. ఈ మొత్తాన్ని ఉంచక పోతే వంద రూపాయల జరిమానాతో పాటు సర్వీసు చార్జీని కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధన నుంచి ప్రధాని జనధన్ ఖాతాలకు - చిన్నస్థాయి పొదుపు ఖాతాలకు మినహాయింపు ఉంటుంది. లక్షల్లో ఖాతాలు కలిగిన ఇతర బ్యాంకులు సైతం కొత్త ఏడాదిలో ఈ రకమైన అదనపు సర్వీసు చార్జీలు విధించేందుకు ఎంతైనా అవకాశం ఉంటుంది.

ఇక బీమా విష‌యంలో కూడా షాకులు త‌ప్ప‌వంటున్నారు. ఆరోగ్య బీమా - వాహన బీమాకూ అదనపు మొత్తాన్ని చెల్లించక తప్పని అనివార్య పరిస్థితి తలెత్తింది. ఏజెంట్లకు మరింత కమిషన్లను చెల్లించేందుకు సాధారణ బీమా సంస్థలకు అనుమతి లభించడంతో ఈ భారం పరోక్షంగా వినియోగదారులపైనే అదనపు చార్జీల రూపంలో పడుతుంది. ఇక థర్డ్‌పార్టీ బీమా 40 నుంచి 50శాతం వరకూ వ్యయభరితం కాబోతోంది. ఇవి కాకుండా డిపాజిట్లపై ఆంక్షలు, అన్నింటికీ ఆధార్ అనుసంధానం..ఇలా ఒకటేమిటి దేశ ప్రజలు ఈ ఏడాదంతా మరింత ఆర్థిక భారాన్ని మోయాల్సిందే!

ఈ మొత్తం ఎపిసోడ్‌ లో కాస్త ఊర‌ట క‌లిగించే విష‌యం ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయ‌డం. ఒకే పేజీలో అన్ని వివరాలు భర్తీ చేస్తే సరిపోతుండం  మరో ఆదాయం పన్ను రిటర్న్స్ దాఖలు విష‌యంలో ల‌భించిన ఊర‌ట‌. ఇందుకు సంబంధించిన ఐటిఆర్ ఫారాన్ని ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. ఇందులో ఆధార్ నెంబర్ - పాన్ నెంబర్‌ ను కచ్చితంగా రాయాలి. పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిపిన రెండు లక్షల రూపాయలపైన డిపాజిట్‌ ల వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. అంతే కాదు. ఆదాయం పన్ను రిటర్న్స్ సకాలంలో దాఖలు చేయకపోయినా కూడా మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇందుకు 5వేల నుంచి పదివేల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది. 5లక్షల వార్షిక ఆదాయం కలిగిన వారికి ఈ జరిమానా 1000 రూపాయల వరకూ ఉంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News