అన్నాడీఎంకే ఆఫీసు నుంచి చిన్న‌మ్మ ఫొటోలు ఔట్‌

Update: 2017-04-26 07:27 GMT
అన్నాడీఎంకే ప్రధాన కార్యద‌ర్శి శ‌శిక‌ళ‌కు ఇంకో షాక్ త‌గిలింది. రెండు ఆకుల గుర్తు కోసం ఎన్నికల సంఘం అధికారులకు లంచం ఇవ్వజూపిన కేసులో శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ ను మంగళవారం అర్థరాత్రి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘ‌ట‌న నుంచి తేరుకోక‌ముందే చిన్న‌మ్మ శిబిరం షాక్‌కు గుర‌య్యేలా ఇంకో ప‌రిణామం జ‌రిగింది. అన్నాడీఎంకే కార్యాల‌యంలో శశికళ ఫోటోలు - బ్యానర్లను తొలగించారు.

అన్నాడీఎంకేలోని రెండు వ‌ర్గాలు ఒక్క‌టి అవ్వాలంటే శ‌శిక‌ళ‌ను - దిన‌క‌ర‌న్‌ ను పార్టీ నుంచి తొల‌గించాల‌ని మాజీ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు ప‌ళ‌నిస్వామి వ‌ర్గం ఒకే చెప్పింది. అయితే అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. మ‌రోవైపు పార్టీ కార్యాల‌యంలో శ‌శిక‌ళ‌ - దిన‌క‌ర‌న్ ఫొటోలు కొనసాగించారు. దీంతో విలీనం వెనుక ఉన్న‌ది శ‌శిక‌ళ అనే సందేహం వ్య‌క్త‌మ‌యింది. శ‌శిక‌ళ - దిన‌క‌ర‌న్ ఫొటోలు తొల‌గిస్తేనే తాము చ‌ర్చ‌ల‌కు వ‌స్తామ‌ని సెల్వం వ‌ర్గం స్ప‌ష్టం చేసింది. దీంతో పార్టీ కేంద్ర కార్యాల‌యంలో శశికళ ఫోటోలు - బ్యానర్లు తొలగించిన అనంతరం దివంగత సీఎం జయలలిత ఫోటోలు - బ్యానర్లను ఏర్పాటు చేశారు.

కాగా, శశికళ బ్యానర్లను తొలగించడం శుభపరిణామమని పన్నీరు సెల్వం వర్గీయులు పేర్కొన్నారు. శశికళ బ్యానర్లు తొలగించడంతో పార్టీ కార్యకర్తలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. అమ్మ ఆశ‌యాల‌కు అనుగుణంగా పార్టీ ముందుకు సాగాలని ఎవ‌రికో భ‌జ‌న చేయ‌డం, వ్య‌క్తుల‌ను హైలెట్ చేయ‌డం అవ‌స‌రం లేద‌ని సెల్వం వ‌ర్గీయులు వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News