బాసర : గాంధీ మార్గంలో సక్సెస్ అయ్యారే

Update: 2022-06-21 06:30 GMT
తెలంగాణ వాకిట విద్యార్థుల నిర‌స‌నల కార‌ణంగా కొన్ని మార్పులు రానున్నాయి. బాసర కేంద్రంగా ఆ బిడ్డ‌లు చేసిన దీక్ష‌లు స‌ఫ‌లీకృతం అయ్యాయి. కేసీఆర్ దిగివ‌చ్చారు. దీంతో నిన్న‌టితో ఏడురోజుల నిర‌స‌న‌లు చ‌దువ‌ల త‌ల్లి వాకిట ముగిశాయి. విద్యాశాఖ మంత్రి సబిత‌మ్మ చొర‌వతో విద్యార్థుల స‌మస్య ప‌రిష్కారానికి తొలి అడుగు పడింది. ఆమె నిన్న‌టి వేళ బాస‌ర ట్రిపుల్ క్యాంప‌స్ కు పోయి అక్క‌డి విద్యార్థుల‌తో చ‌ర్చించి వ‌చ్చారు.

దేశ‌వ్యాప్తంగా వార్తలకు ఎక్కిన ఈ శాంతియుత  గాంధీ త‌ర‌హా నిర‌సన ప్ర‌భుత్వాన్ని మేల్కొల్పింది అన్న‌ది ఇప్ప‌టి ప‌రిశీల‌కుల విశ్లేషణ.  ఇదేవిధంగా ప‌నిచేస్తే విద్యారంగంలో మంచి ఫ‌లితాలు వ‌స్తాయి అన్న‌ది త‌ల్లిదండ్రుల మాట. ఎనీవే థాంక్ యూ కేసీఆర్ అని అంటున్నారు వీరంతా ముక్త కంఠంతో !

ఎప్ప‌టి నుంచో ఇక్క‌డి విద్యార్థులు కోరుకుంటున్న విధంగా రెగ్యుల‌ర్ గా ఇక్క‌డే ఉండే విధంగా వైస్ ఛాన్స‌ల‌ర్ నియామ‌కంపై ప్ర‌భుత్వం  సానుకూలంగానే ఉంద‌ని తెలుస్తోంది. నెల రోజుల్లో కొత్త ఉప సంచాల‌కులు (వీసీ) ని నియ‌మిస్తామ‌ని  హామీ ఇచ్చారు.

రెండు గంట‌ల పాటు సాగిన ఈ చ‌ర్చ‌లు స‌ఫలీకృతం అయ్యాయి. మంత్రి స‌బిత‌మ్మ‌తో అటు విద్యార్థులు, ఇటు అధ్యాప‌కులు కూడా పాల్గొన్నారు. స‌మ‌స్య‌ల‌న్నింట‌నీ ఆమె సావధానంగా విన్నారు. 90 శాతం సమస్యలకు పరిష్కారం చూపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారికి హామీ దొరికింది. మాట తప్పితే మళ్లీ నిరసన మొదలవుతుందని కూడా విద్యార్థులు హెచ్చరించారు.

నిజంగానే ఇది ప్ర‌జా విజ‌యం.. విద్యార్థి విజ‌యం అని త‌ల్లిదండ్రులంతా ఇప్పుడు ఆ బిడ్డ‌ల‌ను ప్ర‌శంసిస్తున్నారు. అదేవిధంగా వ‌ర్శిటీ లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు, ఇత‌ర స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికీ ఐదు కోట్ల రూపాయ‌లు విడుదల చేస్తామ‌ని కూడా చెప్పారు.

వీలైనంత త్వ‌ర‌గా ప్ర‌ధాన స‌మ‌స్య‌ల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామ‌ని సబిత‌మ్మ చెప్ప‌డంతో ఇవాళ్టి నుంచి త‌ర‌గ‌తులు పునః ప్రారంభం కానున్నాయి. చ‌ర్చ‌ల‌కు కలెక్ట‌ర్ అలీ సార‌థ్య బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.
Tags:    

Similar News