రాజుగారి రంగప్రవేశం.. టీడీపీ కొంపకొల్లేరేనా?

Update: 2019-03-30 05:33 GMT
టీడీపీలో సీనియర్‌ నేతగా ఉన్న అశోక్‌ గజపతిరాజు ఎంట్రీతో అక్కడ పరిస్థితి టీడీపీకి వ్యతిరేకంగా తయారైందట.. బీసీలు ఇప్పుడు టీడీపీ అంటేనే ఆగ్రహంగా ఉన్నారట..? రాజుగారు - ఆయన కుమార్తె పోటీ చేస్తున్న స్థానాల్లో ఈ ప్రభావం పడనుందని సమాచారం. బీసీలు ఎక్కువగా ఉన్న  ప్రాంతంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు సీటు రాకుండా చేసిన కేంద్ర మాజీ మంత్రి - టీడీపీ విజయనగరం ఎంపీ అశోక్ గజపతి రాజును ఓడించడానికి ఇప్పుడు విజయనగరంలో బీసీలు ఏకమవ్వడం చర్చనీయాంశంగా మారింది. విభిన్న రాజకీయాలకు కేంద్రంగా ఉన్న విజయనగరం జిల్లాలో కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతి రాజు అసెంబ్లీ  సీటు విషయంలో జోక్యం చేసుకోవడంతో టీడీపీకి అక్కడ ఎదురుగాలి వీస్తోందట..

విజయనగరం లోక్‌ సభ నియోజకవర్గంలో రెండోసారి పోటీ చేస్తున్నారు అశోక్‌ గజపతిరాజు. గత 2014 ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మీసాల గీత విజయం సాధించారు. 2009లో ప్రజారాజ్యం తరుపున పోటీ చేసి ఓడిన ఆమె ఆ తరువాత సార్వత్రిక పోరులో టీడీపీలో చేరి గంటా శ్రీనివాస్‌ - పలువురు టీడీపీ నాయకుల సహకారంతో గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో టికెట్‌ ఆశిస్తుందని ఆశించారు. ఆ రకంగా ప్రచారం చేశారు కూడా.

అయితే ఇక్కడే కథ మలుపు తిరిగింది. టీడీపీలో కీలక నేతగా కొనసాగుతున్న గజపతి రాజు తన కుమార్తె టికెట్‌ కోసం ఎప్పటి నుంచో స్కెచ్‌ వేస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు చేసినా చంద్రబాబు స్పందించకపోవడంతో కొన్నిరోజులు మౌన పోరాటం చేశారు. ఇందులో భాగంగా పొలిట్‌ బ్యూరో సమావేశానికి రాజు గైర్హాజరు కావడంతో చంద్రబాబు దిగొచ్చారు. దీంతో విజయనగరం అసెంబ్లీ సీటును సిట్టింగ్‌ ఎమ్మెల్యే గీతకు కాకుండా అశోక్ గజపతిరాజు కుమార్తెకు కేటాయించారు.

మాజీ ఎమ్మెల్యే గీత బీసీ వర్గానికి చెందినవారు. దీంతో తమ నేతకు టికెట్‌ దక్కకుండా చేసిన అశోక్‌ గజపతిరాజు పై బీసీ సంఘాలు కన్నెర్ర జేస్తున్నారు. మరోవైపు గజపతిరాజు ప్రత్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్‌ వైసీపీ తరుపున బరిలో ఉన్నారు. ఈయన కాపు వర్గానికి చెందిన నేత కావడంతో ఇప్పుడు బీసీ సంఘాలంతా ఆయన వైపే మొగ్గు చూపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత బాబు ఇక్కడి టీడీపీ బీసీ నేతలను ఒప్పించాల్సిన సమయం వచ్చింది. ఎన్నికల్లో అన్నివర్గాలను కలుపుకోవాలని బాబు సూచిస్తున్నా గజపతిరాజు కనీసం బీసీ సంఘాలతో సమావేశం జరిపి బుజ్జగించే ప్రయత్నమూ చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన గెలుపు, ఆయన కుమార్తె గెలుపు పై బీసీ ప్రభావం పడుతోందట.. వీరిద్దరి ఓటమికి బీసీ సంఘాలు కంకణం కట్టుకోవడం టీడీపీ కలవరపెడుతోందట.. .

   

Tags:    

Similar News