పిచ్ లు.. రూల్స్ కాకుండా.. పిచ్చి ప్రశ్నలతో బీసీసీఐ అంపైరింగ్ పరీక్ష

Update: 2022-08-20 11:39 GMT
ప్రస్తుతం క్రికెట్ విశ్వవ్యాపితం అవుతోంది. యూరప్ లో ఐర్లాండ్, నెదర్లాండ్స్.. ఉత్తర అమెరికాలో అమెరికా, ఆఫ్రికాలో నమీబియా, జింబాబ్వే, కెన్యా, మధ్య ఆసియాలో అఫ్గానిస్థాన్, యూఏఈ ఇలా చాలా దేశాల్లో క్రికెట్ ప్రమాణాలు పెరిగాయి. అందుబాటులోకి సాంకేతికత ఆధారంగా రానున్న కాలంలో క్రికెట్.. ఓ ఫుట్ బాల్ లా ప్రపంచ క్రీడ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. క్రికెట్ కు ప్రాణం అనదగ్గది అంపైరింగ్ వ్యవస్థ. ఆ వ్యవస్థ ఎంత సమర్థంగా ఉంటే అంతగా ఆట మెరుగుపడుతుంది.

మన దగ్గర మెరుగే..వర్థమాన దేశాల్లో కంటే మన దేశంలో అంపైరింగ్ వ్యవస్థ చాలా బాగుంటుంది. భారత అంపైర్ల ప్రవర్తన మీద కానీ.. మైదానంలో వారు తీసుకునే నిర్ణయాలపై కానీ ఇప్పటివరకు విమర్శలు రాలేదు. ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ అంపైర్ల మీద అయితే పలుసార్లు తీవ్ర స్థాయిలో దుమారం రేగింది. కానీ, భారత అంపైర్లపై ఇప్పటివరకు ఏమైనా ఒకటీ అరా విమర్శలు తప్ప వారు తప్పు చేశారని వేలెత్తి చూపే పరిస్థితి రాలేదు.

డీఆర్ఎస్ రాకతో మరింత సులువు ఇదివరకు అంపైర్ల మీద ఫిర్యాదు చేయాలంటే ఎల్బీడబ్ల్యూ నిర్ణయాలు ఓ సాకుగా ఉండేవి.  అయితే, ఎప్పుడైతే డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) వచ్చిందో మైదానంలోని అంపైర్లపై ఒత్తిడి తగ్గింది. డీఆర్ఎస్.. వారి ప్రాధాన్యం, పాత్రను తగ్గించినట్లే అయినా కాలక్రమంలో అంతా అర్థం చేసుకున్నారు. దీంతో అంపైర్లను నేరుగా తప్పుబట్టే అవకాశమే లేకపోయింది. అయితే, డీఆర్‌ఎస్‌ లేనప్పుడు అంపైర్‌దే కీలక నిర్ణయం. రనౌట్‌, స్టంపింగ్‌ మినహా మిగతా ఎలాంటి నిర్ణయాలైనా అంపైర్‌ తీర్పు ఫైనల్‌గా ఉంటుంది. కాగా, కొన్నిసార్లు ఔట్‌ కాకపోయినప్పటికి.. అంపైర్‌ తప్పుడు నిర్ణయాల వల్ల బ్యాట్స్‌మెన్లు బలైన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఒక్కోసారి అవి ‍మేలుచేస్తే.. కొన్నిసార్లు కీడు చేశాయి. తప్పుడు అంపైరింగ్‌ వల్ల ఆటగాళ్లు ఫీల్డ్‌ అంపైర్లతో గొడవకు కూడా దిగిన సందర్బాలు కోకొల్లలు. డీఆర్‌ఎస్‌ రూల్‌ వచ్చినప్పటికి.. ఇ‍ప్పటికీ ఫీల్డ్‌ అంపైర్లకే సర్వాధికారాలు ఉంటాయి. థర్డ్‌ అంపైర్‌ ఔట్‌ కాదని ప్రకటించినా.. ఒకవేళ ఫీల్డ్‌ అంపైర్లు ఔట్‌ ఇస్తే బ్యాటర్‌ వెనుదిరగాల్సిందే. ఇలాంటివి అంతర్జాతీయ క్రికెట్‌ సహా బిగ్‌బాష్‌ లీగ్‌, ఐపీఎల్‌ సహా ఇతర ప్రైవేట్‌ లీగ్స్‌లో చాలానే చోటుచేసుకుంటున్నాయి.

పద్ధతి ప్రకారం ఎంపిక.. అంపైరింగ్ లో భారత ప్రమాణాల గురించి చెప్పుకొన్నాం కదా..? వీరి ఎంపిక చాలా పద్ధతిగా సాగుతుంది. అన్ని దేశాల్లోనూ ఇలాగే చేస్తారని భావించవచ్చు కూడా. కాగా, ఇటీవలే ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో కూడా అంపైర్ల నిర్ణయాలపై తీవ్ర దుమారం రేగుతుండడంతో బీసీసీఐ.. అంపైరింగ్ స్థాయిని పెంచేందుకు చర్చలు తీసుకోవడం మొదలెట్టింది. కొత్త అంపైర్లను
తీసుకునే నియామక ప్రక్రియలో అత్యంత కఠినమైన పరీక్షలు నిర్వహించాలని భావించింది. అందుకే గ్రూప్-డి అంపైరింగ్ నియమాకాల కోసం (మహిళలు, జూనియర్ మ్యాచులు) బీసీసీఐ రాత పరీక్ష నిర్వహించింది. 200 మార్కులకు జరిగిన ఈ పరీక్షలో క్వాలిఫికేషన్ మార్కులు 90. రాత పరీక్షకు 100 మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూకి 35 మార్కులు, వీడియో ఇంటర్వ్యూకి 35 మార్కులు ఉంటాయి. ఫిజికల్ టెస్టుకి మిగిలిన 30 మార్కులు ఉంటాయి.

ఇవేం ప్రశ్నలు అంపైరా..? అంపైరింగ్ పరీక్ష అంటే ఓ స్థాయిలో ప్రశ్నలు అడగాలి. కానీ.. ‘ఫ్లడ్ లైట్ల నీడతో పాటు ఫీల్డర్ నీడ కూడా పిచ్ పై పడుతోందని బ్యాటర్ ఫిర్యాదు చేస్తే ఓ అంపైర్ గా మీరేం చేస్తారు..?" "బౌలర్ చేతికి గాయం అయిందంటూ కట్టు కట్టుకున్నాడు. అది నిజం కాదని తెలిసి మీరు పీకేశారు. రక్తం కారింది.. మరి అతడితో బౌలింగ్ చేయిస్తారా?""షార్ట్ లెగ్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్ హెల్మెట్ పెట్టుకోవచ్చు. అలా ఫీల్డర్ హెల్మెట్‌లో బ్యాటర్ కొట్టిన బంతి వెళ్లి ఇరుక్కుని, దాన్ని ఫీల్డర్ క్యాచ్‌గా పట్టుకుంటే అది ఔట్‌గా పరిగణిస్తారా? " ఇలాంటి తిక్క ప్రశ్నలతో బీసీసీఐ అంపైరింగ్ పరీక్ష నిర్వహించింది. అయితే.. ఇవే కాక మరో 37 ప్రశ్నలు చొప్పదంటూ ప్రశ్నలంటూ విమర్శలు వచ్చాయి. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో నిర్వహించిన ఈ పరీక్షకు 140 మంది హాజరయ్యారు. వీరిలో నుంచి ముగ్గురిని ఎంపిక చేయనున్నారు. కాగా, ప్రశ్నలు ఆంత పేలవంగా ఉన్నాయేమిటంటూ ఓ బీసీసీఐ అధికారిని అడగ్గా.. "క్రికెట్ రూల్స్ గురించి మాత్రమే కాదు. భిన్నమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఒక అంపైర్ సమయోచితంగా ఎలా నిర్ణయం తీసుకుంటాడనేది ముఖ్యం. అది తెలుసుకునేందుకు ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నలతో పరీక్ష నిర్వహించాం" అని వివరణ ఇవ్వడం విశేషం.
Tags:    

Similar News