బ్యూటీపార్లర్ పెట్టి చిట్టీలు మొదలెట్టింది.. కట్ చేస్తే..?

Update: 2022-01-24 04:33 GMT
అందరికి అర్థమయ్యేలా చేస్తే మోసం చేయటానికి అవకాశం ఉండదు. ఊహించనీ రీతిలో ఎత్తులు వేస్తే కానీ.. ఇప్పుడున్న రోజుల్లో అడ్డంగా బుక్ కారు. ఎవరు చేయాల్సిన యాపారం వాళ్లు చేయని ఈ రోజుల్లో.. అడ్డదిడ్డమైన ఆశల్ని చూపించి.. మోసం చేసే బ్యాచ్ అంతకంతకూ ఎక్కువ అవుతున్నారు. అనంతపురం పట్టణానికి చెందిన జయలక్ష్మి కూడా ఈ కోవకు చెందుతారు. బ్యూటీపార్లర్ నడిపే ఆమె.. చిట్టీల యాపారానికి సూట్ అవుతారా? లేదా? అన్నది ఆలోచించని ఆడోళ్లు.. ఆమె మాటలకు పడిపోయి దారుణంగా దెబ్బ పడిపోయారు.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.20 కోట్ల మొత్తాన్ని కలెక్టు చేసి.. రాత్రికి రాత్రి జంప్ అయిన వైనం అనంతపురంలో హాట్ టాపిక్ గా మారింది. అనంతపురం పట్టణంలోని విద్యుత్ నగర్ కు చెందిన జయలక్ష్మి బ్యూటీ పార్లర్ నడుపుతూ.. మరోవైపు చిట్టీల యాపారం నడిపేవారు. వాస్తవానికి.. ఆమె అసలైన బ్యూటీపార్లర్ వ్యాపారం కంటే కూడా చిట్టీల యాపారమే ఎక్కువగా నడిచేది. ఆమెను నమ్మి పెద్ద ఎత్తున చిట్టీలు వేసేవారు. ఆమె వద్ద చిట్టీలు పాడిన తర్వాత టైంకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా.. తిప్పుతోంది.

దీంతో.. ఆమెపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటివేళలో.. అర్థరాత్రి వేళ ఎవరికి చెప్పా పెట్టకుండా.. ఊరి నుంచి జంప్ అవుతున్న వేళ.. ఆమె ప్లాన్ ను గుర్తించిన బాధితులు ఆమెను అడ్డుకున్నారు. తప్పించుకునే ప్రయత్నం చేయగా.. వెంటబడి పట్టుకొని ఇటుకల పల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. ఆమె చిట్టీల రూపంలో జనాల నుంచి వసూలు చేసిన మొత్తం దాదాపు రూ.20 కోట్ల వరకు ఉంటుందన్న మాట వినిపిస్తోంది.

 ఇదిలా ఉంటే.. తమను మోసం చేసి జంప్ అవుతున్న జయలక్ష్మిని కఠినంగా శిక్షించాలని కోరుతూ బాధిత మహిళలు పోలీస్ స్టేషన్ కు వెళితే.. అక్కడ సీన్ రివర్సు అయ్యిందని చెబుతున్నారు. స్థానిక ఎస్ఐ.. బ్యూటీపార్లర్ జయలక్ష్మికి మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇంతకూ.. ఎవరిని అడిగి చిట్టీలు వేశారంటూ ఆయన ప్రశ్నిస్తున్నారంటూ ఎస్ఐ తీరును మహిళలు పలువురు తప్పు పడుతున్నారు.

దీంతో.. ఎస్ఐ తీరుకు నిరసనగా స్టేషన్ ముందు బైఠాయించి మహిళలు ఆందోళనలు చేపట్టారు. ఇది సివిల్ కేసు అని.. బాధితులు కోర్టుకు వెళ్లాలని పోలీసులు సూచన చేయటంపై పలువురు పలు రకాలుగా మాట్లాడుకోవటం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. జయలక్ష్మి మీద పలు స్టేషన్లలో ఇప్పటికే పలు చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయని.. అయినప్పటికీ పోలీసులు ఇలా ఎందుకు మాట్లాడుతున్నట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News