టాస్క్ ఫోర్స్ కేసులో కోర్టు సంచ‌ల‌న తీర్పు!

Update: 2017-08-10 11:32 GMT
రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన బేగంపేట టాస్క్ ఫోర్స్ కార్యాల‌యం బాంబు దాడి కేసులో ఈ రోజు తుది తీర్పు వెలువ‌డింది. హైదరాబాద్ న‌గ‌రంలో జ‌రిగిన‌ తొలి మానవబాంబు దాడి కేసులో కోర్టు కీలక తీర్పును వెలువరించింది.  ఆ ఘ‌ట‌న జరిగిన 12 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఈ కేసులో 10 మంది నిందితుల‌ను నిర్దోషులుగా ప్ర‌క‌టిస్తూ నాంప‌ల్లి మెట్రోపాలిట‌న్ సెష‌న్స్ కోర్టు తీర్పునిచ్చింది. ప్రాసిక్యూషన్‌ ఆధారాలు చూపలేకపోయవడంతో 10 మందిపై  కేసును న్యాయస్థానం కొట్టివేసింది. కోర్టు తీర్పును డిఫెన్స్‌ లాయర్‌ స్వాగతించారు. ప్రాసిక్యూషన్‌ సాక్ష్యాధారాలు చూపకపోవడంతో నిందితులను నిర్దోషులుగా కోర్టు తేల్చిందని చెప్పారు.

2005, అక్టోబరు 12న టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై మానవబాంబు దాడి జరిగింది. ఆ ఘ‌ట‌న‌తో రాష్ట్రం ఒక్క‌సారిగా ఉలిక్క‌ప‌డింది. ఈ దాడిలో హోంగార్డు సత్యనారాయణ అక్కడికక్కడే చనిపోగా - కానిస్టేబుల్‌ వెంకటరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డింది హుజీ ఉగ్ర‌వాదుల‌ని దర్యాప్తులో తేలింది. బంగ్లాదేశ్ కు చెందిన ఉగ్ర‌వాద సంస్థ‌ హుజీ ఉగ్ర‌వాదుల‌ను ఇక్కడికి తీసుకొచ్చి మానవబాంబుగా మార్చి ఈ దాడికి పాల్పడిందని దర్యాప్తు సంస్థ తేల్చింది.

ఈ ఘ‌ట‌న‌లో విచార‌ణ చేప‌ట్టిన ద‌ర్యాప్తు అధికారులు ....మొత్తం 20 మంది నిందితులను గుర్తించగా 10 మందిని అరెస్ట్‌ చేశారు. నిందితులపై కోర్టులో అభియోగపత్రాలు సమర్పించి, విచారణ మొదలుపెట్టారు. ముగ్గురు ఎన్‌ కౌంటర్‌ లో హతమయ్యారు.నిందితుల్లో కొంత మంది కొందరు 11 ఏళ్లుగా జైలులో ఉన్నారని, మరికొందరు ఏడేళ్లుగా కారాగారవాసం గడుపుతున్నారని తెలిపారు. 12 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఈ కేసులో అంద‌రూ నిర్దోషుల‌ని తీర్పు వ‌చ్చింది. కోర్టు తీర్పుపై ప్రాసిక్యూషన్‌... హైకోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.
Tags:    

Similar News