పెట్రోల్ బంకుల్లో ఇలా కూడా మోసం చేస్తారు

Update: 2017-04-29 17:01 GMT
ఇప్ప‌టికే త‌ర‌చుగా ధ‌ర‌లు పెరుగుతున్న పెట్రోల్ వల్ల‌ వినియోగ‌దారులు బెంబేలెత్తిపోతుంటే....కొత్త రూపంలో వినియోగ‌దారుల జేబులు గుల్ల అయ్యే మోసం బట్టబయలైంది. కొందరు బంకు యజమానులు, సిబ్బంది కుమ్మక్కై పెట్రోల్ పంపుల యంత్రాల్లో చిప్ అమర్చుతున్నారని, లీటర్‌కు 50 మిల్లీలీటర్లకు పైగా దోచేస్తున్నారని తేలింది. కేవలం రూ.3000 ఖర్చుతో నెలకు రూ.14 లక్షలు దోపిడీ చేస్తున్న వైనం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు జరిపిన తనిఖీల్లో బట్టబయలైంది.

స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్ అధికారులు గురువారం రాత్రి లక్నోలోని ఏడు పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేపట్టారు. పలు బంకుల్లో ప్రత్యేక ఎలక్ట్రానిక్ చిప్ ఉపయోగించి రీడింగ్ ఎక్కువగా చూపిస్తున్నట్టు గుర్తించారు. రీడింగ్ డిస్‌ ప్లేపై ఒక లీటర్ కనిపిస్తున్నా, వినియోగదారుడికి మాత్రం 50-60 మిల్లీలీటర్ల పెట్రోల్ తక్కువగా వస్తున్నదని తేల్చారు. ఆయా బంకుల్లో పనిచేస్తున్న సిబ్బందిని అదుపులోకి తీసుకొని, బంకుల యజమానులపై కేసులు నమోదు చేశారు. ఈ చిప్ విలువ రూ.3000 ఉంటుందని, మెకానిక్‌ ల సహాయంతో యంత్రాలకు అమర్చుతున్నారని పోలీసులు తెలిపారు. దీనిని రిమోట్‌ తో నియంత్రించవచ్చన్నారు. ఈ చిప్‌ తో పంపుల నుంచి పెట్రోల్‌ లో దాదాపు 60 శాతం తగ్గించే అవకాశం ఉన్నదని వివరించారు. ఈ చిప్‌ లను రవీందర్ అనే వ్యక్తి తయారు చేసినట్టు గుర్తించామన్నారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేప‌ట్ట‌గా, ఇప్పటివరకు 1000 చిప్‌లను అమ్మినట్టు చెప్పాడన్నారు. ఈ చిప్‌ ల సహాయంతో ఒక్కో బంక్ యజమాని నెలకు దాదాపు రూ.14 లక్షలు సంపాదిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న మోసాలివీ..

-మీటర్ రీడింగ్‌లో సర్దుబాటు:

పాతతరం యంత్రాల్లో రీడింగ్ మీటర్‌ ను సర్దుబాటు చేస్తారు. దీంతో తక్కువ పెట్రోల్ పోసినా రీడింగ్ ఎక్కువగా చూపిస్తుంది. ఇది పాత టెక్నిక్. వేర్వేరు బంకుల్లో పెట్రోల్ పోసుకొని మైలేజ్‌ ను గమనించినప్పుడే ఈ మోసం బయటపడుతుంది.

మాటల్లో పెట్టి మాయ చేయడం:

మీరు పెట్రోల్ పోసుకునే సమయంలో బంకు సిబ్బంది మిమ్మల్ని మాటల్లో దింపొచ్చు. అంతకు ముందు ఓ వ్యక్తి రూ.50 పెట్రోల్ పోసుకుంటే, ఆ రీడింగ్‌ ను మార్చకుండానే మీకు పెట్రోల్ పోస్తారు. కొన్నిసార్లు మీరు రూ.1000 పెట్రోల్ పోయమంటే సరిగా వినపడనట్టు నటించి రూ.200 పెట్రోల్ పోస్తారు. మరోసారి చెప్పినప్పుడు మాటల్లో దింపి పాత రీడింగ్ మార్చకుండానే రూ.800 వచ్చే వరకు పెట్రోల్ పోస్తారు. అంటే రూ.200 నష్టపోయినట్టే.

పొడవైన పైపులు వాడడం:

కొన్ని పెట్రోల్ బంకుల్లో పొడవుగా ఉండే పైపులను వాడుతారు. వినియోగదారుడిని దూరంగా ఉంచి పెట్రోల్ పోస్తారు. మీటర్ రీడింగ్ పూర్తయిన వెంటనే నాజిల్‌ను ఆఫ్ చేస్తారు. దీంతో పైపులో ఉన్నంత మేర పెట్రోల్ మిగులుతుంది. దీనిని నివారించేందుకు వాహనాన్ని యంత్రానికి దగ్గరలో ఉంచాలి, పైపులో ఉన్న పెట్రోల్ పూర్తిగా అయిపోయేవరకు నాజిల్ ఆఫ్ చేయొద్దని సిబ్బందికి చెప్పాలి.

రౌండ్ ఫిగర్:

బంకుల్లో తక్కువ పెట్రోల్ పోసినా రూ.100 - 500 - 1000 కనిపించేలా సర్దుబాటు చేస్తున్నారు. రూ.125 - 575.. ఇలాంటి సంఖ్యలతో పెట్రోల్ పోయించుకుంటే దీనిని నివారించవచ్చు. రౌండ్ ఫిగర్ల జోలికి వెళ్లకపోవడం మంచిది. ఏవైనా తప్పులు గుర్తిస్తే వెంటనే బంక్ మేనేజర్‌ ను కలిసి వివరణ తీసుకోవాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News