భద్రాద్రి రాములోరి నగలు కనిపించట్లేదట

Update: 2016-08-21 06:18 GMT
మరో సంచలనం చోటు చేసుకుంది. ప్రఖ్యాత ఆలయంలోని ఉత్సవ మూర్తుల ఆభరణాలు మిస్ అయినట్లుగా జరుగుతున్న ప్రచారం ఇప్పుడు కలకలానికి గురి చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయంలో చోరీ జరిగినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రముఖ మీడియా సంస్థలు సైతం ఇదే విషయాన్ని అనుమానం వ్యక్తం చేస్తూ చెప్పటం గమనార్హం. మిస్ అయిన ఆభరణాలు ఏవన్న విషయంపై స్పష్టత లేకున్నా.. అవన్నిపురాతనమైనవని.. ప్రాశస్త్యం ఉన్న నగలేనన్న మాట పలువురు నోట నుంచి రావటం గమనార్హం.

రాములోరి హారంలోని బంగారుపూసలు మిస్ అయినట్లుగా చెబుతున్నారు. విలువ లక్షల్లో ఉన్నా.. వాటికున్న పవిత్రత.. పురాతనమైనవి కావటం ఇప్పుడీ అంశంపై కలకలం రేగుతోంది. ఈ నెల 13 నుంచి 18 వరకు స్వామి వారి పవిత్రోత్సవాలు జరిగాయి. ఈ సదర్భంగా ఉత్సవమూర్తుల ఆభరణాలు పరిశీలించినప్పుడు కొన్ని ఆభరణాలు మిస్ అయిన విషయాన్ని గుర్తించినట్లుగా చెబుతున్నారు.

ఆభరణాలు ఉంచిన గదికి కట్టుదిట్టమైన భద్రత.. బలమైన తాళాలు ఉన్నప్పటికీ నగలు మాయమయ్యాయన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ నగలున్న చోట చోరీ అయ్యే అవకాశం లేదని చెబుతున్నారు. సీసీ కెమేరాలతో పాటు.. బయట వ్యక్తులు విగ్రహాల వద్దకు వెళ్లే అవకాశమే లేదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా పవిత్రోత్సవం జరిగే నాటికే మిస్ అయినట్లుగా భావిస్తున్న ఆభరణాలు అసలు ఉన్నాయా? అన్నది ఇప్పుడో ప్రశ్నగా మారింది. ఒకవేళ అప్పుడు ఉంటే. . ఎప్పుడు మిస్ అయినట్లు? అన్న మరో ప్రశ్న తలెత్తుతోంది.

రాములోరి ఆభరణాలు చోరీకి గురి అయ్యాయన్న వార్త దావనలంలా వ్యాపించటం.. నిజమా? కాదా? అన్న అంశంపై స్పష్టత లేకపోవటంతో ఒకలాంటి ఉత్కంట వాతావరణంతో పాటు.. ఇదంతా ఎక్కడ మొదలై.. మరెక్కడికి తేలుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంలో పలువాదనలు బయటకు వస్తున్నాయి. స్వామి వారికి అలంకారంగా చేసేందుకు వినియోగించే పుష్పాలు.. తులసిమాలలో ఆభరణాలు చిక్కుకుపోయాయా? అన్న సందేహాన్ని కొందరువ్యక్తం చేస్తున్నారు.మరికొందరు... పల్లకిలో ఊరేగే సమయంలో ఆభరణాలుకింద పడే వీలుందా? అన్న అంశాన్ని పరిశీలించాలని చెబుతున్నారు. అయితే.. ఈ వాదనలపై మరో కౌంటర్ వాదన నడుస్తోంది. అలంకరణ.. ఊరేగింపు లాంటివి కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న కార్యక్రమాలని.. అప్పుడెప్పుడు మిస్ కానిది ఇప్పుడే ఎలా మిస్ అవుతాయన్న ప్రశ్న వినిపిస్తోంది. ఏమైనా రాములోరి నగలు మిస్ అయ్యాయి అన్న ప్రచారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
Tags:    

Similar News