యాత్ర‌లో భ‌ట్టికి అస్వ‌స్థ‌త‌.. ఆసుప‌త్రికి త‌ర‌లింపు!

Update: 2019-05-02 08:18 GMT
కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును త‌ప్పు ప‌డుతూ.. కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఇటీవ‌ల యాత్ర‌ను చేపట్టిన సంగ‌తి తెలిసిందే. మండే ఎండ‌ల్లో గ‌డిచిన మూడు రోజులుగా ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ యాత్ర‌ను నిర్వ‌హిస్తున్నారు. సంత‌లో ప‌శువుల మాదిరి.. ఎన్నిక‌ల్లో గెలిచిన ఎమ్మెల్యేల‌ను కొనేస్తున్న కేసీఆర్ తీరును త‌ప్పు ప‌డుతూ యాత్ర‌ను నిర్వ‌హిస్తున్నారు.

ఘాటు వ్యాఖ్య‌ల‌తో ప్ర‌భుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్న భ‌ట్టి యాత్ర‌ల‌కు స్పంద‌న బాగా వ‌స్తుంద‌న్న మాట వినిపిస్తోంది. మీడియాలో పెద్ద‌గా క‌వ‌రేజ్ లేకున్నా.. గ్రౌండ్ లెవెల్ లో మాత్రం భ‌ట్టి యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న వ‌స్తున్న వేళ‌.. ఆయ‌న అనారోగ్యానికి గురయ్యారు. ఖ‌మ్మం జిల్లాలో నిర్వ‌హిస్తున్న ఆయ‌న యాత్ర‌.. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో బ్రేక్ ప‌డ‌నుంది.

ఎండ‌ల తీవ్ర‌త ఎక్క‌వ‌గా ఉన్న వేళ‌.. విశ్రాంతి లేకుండా యాత్ర నిర్వ‌హిస్తున్న ఆయ‌న అనారోగ్యం పాల‌య్యారు. వ‌డ దెబ్బ త‌గిలిన‌ట్లుగా భావిస్తున్నారు. అస్వ‌స్థ‌త‌కు గురైన భ‌ట్టిని వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వైద్యులు చెబుతున్నారు.

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున గెలిచిన ఎమ్మెల్యేలు ప‌లువురు గులాబీ కారులో ఎక్కిన విష‌యం తెలిసిందే. అలా జంప్ అయిన ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో భ‌ట్టి యాత్ర‌ను నిర్వ‌హిస్తున్నారు. ఆసుప‌త్రిలో రెస్ట్ తీసుకుంటున్న భ‌ట్టి వెంట ఆయ‌న స‌తీమ‌ణి ఉన్నారు.
Tags:    

Similar News