భట్టి వదిలేట్టు లేడుగా?.. డబుల్ బెడ్రూం మీద తాజాగా మరో షాక్

Update: 2020-09-22 17:43 GMT
అందుకే అంటారు ప్రపంచంలో ఎవరూ తెలివితక్కువ వాళ్లు కాదు. ఉచ్చులో పడేసేందుకు కొన్నిసార్లు తగ్గినట్లు కనిపించటం వ్యూహంలో భాగమే తప్పించి.. నిజంగా తగ్గినట్లు కాదన్న విషయం తెలంగాణ అధికారపక్షానికి ఇప్పటికైనా అర్థమై ఉండాలి. అసెంబ్లీలో డబుల్ బెడ్రూం ఇళ్ల మీద కలర్ సినిమా చూపించే ప్రయత్నం చేసిన ప్రభుత్వానికి సవాలు విసిరారు సీఎల్పీ నేత భట్టి. అక్కడితో ఆగితే విషయం ఎలా ఉండేదో.

కానీ.. మంత్రి తలసాని అత్యుత్సాహానికి పోయి భట్టి ఇంటికి నేరుగా వెళ్లి.. సవాలులో భాగంగా.. గ్రేటర్ లో లక్ష ఇళ్లు చూపిస్తానని చెప్పి వెంట తీసుకెళ్లటంతో సవాలు విసిరి భట్టి తప్పు చేస్తున్నారేమోనన్న భావన కలిగింది. రోటీన్ రాజకీయ నేతలకు భిన్నంగా.. టీచర్ చెప్పినట్లు నడుచుకునే బుద్దిమంతుడైన స్కూల్ పిల్లాడి మాదిరి వ్యవహరించిన భట్టిని చూసి చాలామంది.. ఈ మాత్రం తెలివి లేదా? అనుకున్నోళ్లు లేకపోలేదు.
మొదటిరోజు తలసాని అధిక్యత కొట్టొచ్చినట్లు కనిపిస్తే.. విపక్ష భట్టి తేలిపోయినట్లు కనిపించారు. రెండో రోజు అసలు ఆట మొదలైంది. మీరు చూపిస్తానన్నది గ్రేటర్ హైదరాబాద్ లో.. తీసుకెళుతున్నది హైదరాబాద్ శివారుకు.. ఇదేం న్యాయమంటూ అసలు పాయింట్ బయటకు తీయటంతో తలసాని అండ్ కో ఆత్మరక్షణలో పడినట్లైంది. అప్పటివరకు భట్టి వ్యవహరించిన తీరుకు భిన్నంగా ఉండటంతో తాము తొందరపడిన వైనాన్ని మంత్రి తలసాని గుర్తించినట్లుగా కనిపిస్తోంది.

అది మొదలు.. రోజురోజుకు డబుల్ బెడ్రూం ఇళ్ల వ్యవహారాన్ని భట్టి సీరియస్ గా తీసుకొని.. డైలీ బేసిస్ లో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తి చూపించటం షురూ చేశారు. ఎదురుదాడి చేయాల్సిన తలసాని మౌనముద్ర దాల్చటం.. భట్టికి మరింత ఉత్సాహాన్ని పెంచింది. తాజాగా నాంపల్లి నియోజకవర్గానికి మీడియాకు తీసుకెళ్లిన భట్టి.. ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం 1824 ఇళ్లు కట్టినట్లు చెప్పారని.. కానీ ఒక్క ఇల్లు కట్టలేదని తేల్చారు. అంతేకాదు.. ఐదేళ్ల క్రితం శంకుస్థాపన చేసి వదిలేసినట్లుగా పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ లోని రెండు ప్రాంతాల్లో 226 ఇళ్లు కట్టినట్లుగా చెప్పారని.. ఆ జాబితాలోనూ అనేక అవకతవకలు ఉన్నట్లుగా పేర్కొన్నారు.

2016-17లో హైదరాబాద్ లోని ప్రతి అర్బన్ నియోజకవర్గానికి పదివేల చొప్పున డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన వైనాన్ని గుర్తు చేశారు. అందుకు భిన్నంగా జీహెచ్ఎంసీ పరిధిలో 2.4 లక్షల ఇళ్లు ఎప్పుడు కడతారంటూ ప్రశ్నించారు భట్టి. లక్ష ఇళ్లు కట్టినట్లుగా దొంగ లెక్కలు చూపిస్తారని చెప్పటం ద్వారా తెలంగాణ అధికారపక్షాన్ని ఆత్మరక్షణలో పడేలా చేశారు. చూస్తుంటే.. భట్టి వారి దెబ్బకు తలసారి వారికి దిమ్మ తిరిగిపోయేలా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ఎపిసోడ్ తర్వాత అయినా తలసాని తనకు అలవాటైన దూకుడుకు కళ్లాలు వేస్తారేమో చూడాలి.
Tags:    

Similar News