ట్వీట్ పంచ్ కు మిత్రమా అంటూనే ఘాటు కౌంటర్ ఇచ్చిన భూమన

Update: 2020-08-30 16:30 GMT
ఒక లేఖ మిత్రుల మధ్య కొత్త చిక్కుముడి పడేలా చేసింది. ఏ చిన్న పొరపాటు జరిగినా.. పీటముడిగా మారి విషయం ఎక్కడికో వెళ్లటం ఖాయం. సున్నితంగా మారిన అంశాన్ని తాజాగా డీల్ చేసిన తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమాన తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ లేఖేమిటి? దానికి బదులుగా వచ్చిన ట్వీట్ ఏమిటి? ఇప్పుడు మరో కౌంటర్ ఏమిటన్న కన్ఫ్యూజన్ కలుగుతుందా? వివరంగా చెప్పుకొస్తే..

అభ్యుదయ రచయిత వరవరరావును అరెస్టు చేయటం ఆయన్ను తీహార్ జైలుకు తరలించటం.. అక్కడ అనారోగ్యానికి గురైన ఆయన్ను తాజాగా ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయిస్తుండటం తెలిసిందే. ఆయన్ను విడుదల చేయాలంటూ ఇప్పటికే పలువురు వామపక్ష నేతలు.. మేధావులు.. బుద్ధజీవులు అనే వారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయడుకి లేఖ రాశారు. ఇదే క్రమంలో భూమాన కూడా లేఖ రాయటం ఆసక్తికరంగా మారింది. అయితే.. తాను లేఖ రాయటం వెనుక తెలిపిన కారణం కన్వీన్స్ గా ఉండటంతో వ్యవహారం అక్కడితో ఆగింది.

ఇదిలా ఉంటే..తాజాగా ఏపీ బీజేపీ ఎంపీ ఇంచార్జ్సునీల్ ధియోధర్ ట్విట్టర్ వేదికగా తప్పు పట్టటమే కాదు.. ఘాటుగా స్పందించారు. ప్రధాని మోడీ హత్యకు కుట్ర పన్నిన వ్యక్తిని సమర్థించటం ఏమిటి? ఆయన్ను విడుదల చేయమని కోరటం ఏమిటి? అంటూ చేసిన ట్వీట్ కొత్త చర్చకు తెర తీసింది. భూమాన లేఖను తప్పు పట్టిన నేపథ్యంలో.. ఆయన చేసిన విమర్శలకు సమాధానం ఇస్తూ.. వివరంగా ఒక లేఖ రాశారు భూమన.
తాను రాసిన లేఖలో వరవరరావును అనారోగ్యంతో ఉన్న 81 ఏళ్ల వృద్ధుడిగా మాత్రమే తాను చూస్తున్నట్లుగా పేర్కొన్నారు. అంతేకానీ.. తాను ఆయన భావజాలాన్ని అంగీకరించలేదన్న వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. చివర్లో మిత్రమా అంటూ ఘాటైన కౌంటర్ ఇవ్వటం గమనార్హం. కరుణాకర్ లేఖలో ప్రస్తావించిన ముఖ్యమైన అంశాల్ని చూస్తే..
- ‘‘53 సంవత్సరాలుగా ఆయుధం పట్టి, సాయుధులై తిరిగే వాళ్లు సాధించలేని విప్లవం ఓ వృద్ధుడు సాధించగలడా..? అని తెలియజేశాను. నేను రాడికల్ అని మాత్రమే తెలుసు. అయితే 1969-70లో ఆర్ఎస్ఎస్ భావజాలంతో నా రాజకీయం ప్రారంభమైంది. అప్పట్లో తిరుపతి ఆర్ఎస్ఎస్ ప్రచారకులు బారా (ప్రస్తుతం నెల్లూరులోని ఆదిత్య విద్యా సంస్థల యజమాని) నా పట్ల ఎంతో అభిమానంతో ఉండేవారు’’
- ‘‘సాయుధ పోరాట మార్గం పట్ల, హింస ఆయుధంగా గల వారి పట్ల నాకు సుముఖత లేదు. అహింస పరమధర్మం, క్షమ ఉత్తమగుణం అనే అత్యుత్తమ హైందవ వాదం నేను బలంగా నమ్ముతాను. అనారోగ్యంతో ఉన్న ఓ 81 సంవత్సరాల వృద్ధుడిపై జాలి చూపించమని కోరడం నేరం అని మీరు భావిస్తే ఏం చెప్పను..?. నమస్కరించటం తప్ప’’
- ‘‘46 సంవత్సరాల క్రితం వరవరరావు గారు, నేను, భారత ఉప రాష్ట్రపతి గారు జైలులో కలిసి ఉన్నాం కాబట్టి నేను వెంకయ్య గారికి వ్యక్తిగతంగా లేఖ రాశాను. నా లాగే వరవరరావు గారిని విడుదల చేయమని చాలా మంది మేథావులు లేఖ రాశారు. వారందరినీ దేశ బహిష్కారం చేయమని కోరడటం న్యాయంగా ఉంటుందా?’’
- ‘‘తరతరాల భారతీయ సంస్కృతి నేర్పిన క్షమాగుణం వైపు, న్యాయం వైపు, ధర్మంవైపు, మనిషి వైపు నిలబడడం మీ దృష్టిలో నేరం అయితే, ఆ నేరం నేను నిరంతరం చేస్తూనే ఉంటాను’’

- ‘‘మిత్రమా! భారత ప్రధాని పట్ల అపార గౌరవం, అభిమానం, ప్రేమ ఉన్నాయి. ఆయన మనందరి అభిమాన నాయకుడు. నా వ్యక్తిగత అభిప్రాయానికి, మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మీరు ముడిపెడుతూ ట్విట్టర్‌లో రాయటం బాధ కలిగించింది. నవ్వు కూడా తెప్పించింది. చివరగా.. శత్రువును చంపడం కాదు, క్షమించటం పెద్ద శిక్ష అని నమ్ముతాను ఆపై మీ విజ్ఞత’’
Tags:    

Similar News