భువీ బంతి వేగం.. 208 కి.మీ.?

Update: 2022-06-27 08:33 GMT
ఉమ్రాన్ మాలిక్.. గంటకు 155 కిలోమీటర్ల పైగా బంతులు విసిరే భారత ఫాస్టెస్ట్ బౌలర్. మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, అవేశ్ ఖాన్.. గంటకు 145 కి.మీ. వేగంతో బంతులేయగల బౌలర్లు. మరి భువనేశ్వర్ కుమార్..? గంటకు 135 కి.మీ. వేగంతో బంతులేస్తే గొప్ప. ఓవర్ లో ఒక్క బంతైనా 140 కి.మీ. వేగం దాటితే మరీ గొప్ప. ఇక భువీ నుంచి 145 కి.మీ. వేగం అంటే మర్చిపోవాల్సిందే. అలాంటి భువనేశ్వర్ ఏకంగా 208 కి.మీ. వేగంతో బాల్ వేశాడు. అందరినీ ముక్కున వేలేసుకునేలా చేశాడు. ఉమ్రాన్ మాలిక్ గరిష్ఠ వేగవంతమైన బంతి కంటే 50 కి.మీ.అధికం. అంతేకాదు.. ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్. బహుశా.. భవిష్యత్ లో మరెవరూ ఈ వేగాన్ని అందుకోలేరోమో? అయితే, ఇదంతా ఎలా జరిగిందంటే?

ఉమ్రాన్, అక్తర్ ను మించాడా???1995-2005 మధ్య దశాబ్ద కాలంలో ప్రపంచ క్రికెట్ లో వేగవంతమైన బౌలర్లు అంటే.. ఎవరైనా చెప్పే పేర్లు షోయబ్ అక్తర్ (పాకిస్థాన్), బ్రెట్ లీ (ఆస్ట్రేలియా). వీరిద్దరిలో అక్తర్ కంటే.. బ్రెట్ లీ కెరీర్ ఎక్కువ కాలం కొనసాగింది. అయితే, వేగంలో మాత్రం అక్తర్ ను బ్రెట్ లీ మించలేకపోయాడు. ఇప్పుడు మాత్రం ఫాస్టెస్ట్ బౌలర్ అంటే దక్షిణాఫ్రికా పేసర్ ఎన్రిచ్ నార్జ్. ఇతడు గంటకు 150 కి.మీ. వేగంతో నిలకడగా బంతులేస్తున్నాడు. అయితే, ఆదివారం నాటి ఐర్లాండ్ తో టి20 మ్యాచ్ లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఉమ్రాన్ మాలిక్.. కొద్ది రోజుల్లో నార్జ్ ను అధిగమించే వీలుంది. ఇక నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో భారత్‌ శుభారంభం చేసింది. ఆల్ రౌండర్ హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇదే మ్యాచ్ లో పేస్ బౌలింగ్ దళానికి నాయకత్వం వహించాడు.

మొదటి బంతికే.. అద్వితీయ వేగం నిన్నటి మ్యాచ్ లో టాస్ గెలిచిన ఐర్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, ప్రధాన బౌలర్ గా మొదటి ఓవర్ వేసేందుకు బంతిని అందుకున్న భువనేశ్వర్ తొలి బంతితోనే అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఆ బంతి వేగం మీటర్ గంటకు 201 కిలోమీటర్లుగా చూపింది. దీంతో ఆటగాళ్లతో పాటు అభిమానులు, వ్యాఖ్యాతలు నోరెళ్లబెట్టారు. కానీ, 135 కిలోమీటర్లు వేగం మించలేని భువీ.. 200 కి.మీ. వేగం దాటాడా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఇదే నిజమైతే ప్రపంచ రికార్డు బద్దలేనని కొందరు సంబరపడ్డారు. అయితే సాంకేతిక లోపంలో భువీ వేసిన బంతి వేగం తప్పుగా చూపించడంతో అతని ముందు అక్తర్, ఉమ్రాన్ మాలిక్‌లు కూడా పనికిరారని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. వరల్డ్ రికార్డు బద్దలైందంటూ స్పీడ్ మీటర్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

వేగం కాదు.. తప్పిదం..భువీ అసలు అంత వేగంతో బంతి విసిరాడా? కాదు.. అది స్పీడ్ మీటర్ తప్పిదం. దీంతో అందరూ నవ్వుకున్నారు. కొందరు ఓస్.. ఇంతేనా అని సమాధానపడ్డారు. వాస్తవానికి భువీ కెరీర్ ప్రారంభ వేగమే 130 కి.మీ. అయితే, అతడిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ‘‘స్వింగ్’’. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల ప్రతిభ భువీ సొంతం. ఇంగ్లండ్ లాంటి మైదానాల్లో అయితే.. వాతావరణం కలిసొస్తే భువీ చెలరేగిపోతాడు. సర్రున లోపలకు దూసుకొచ్చే బంతులతో వికెట్లను గిరాటేస్తుంటాడు. అదే అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది. కాగా, కొన్నాళ్ల కిందట ఈ స్వింగ్ ను కోల్పోయిన భువీ.. జట్టులో చోటునూ కోల్పోయాడు. ప్రస్తుతం టి20ల్లో నిలకడగా, పొదుపుగా బౌలింగ్ చేస్తూ భళా అనిపిస్తున్నాడు.

అక్తర్ రికార్డు.. ఎప్పటికీ బ్రేక్ కాదా?అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగవంతమై బంతిని వేసింది షోయబ్ అక్తర్. గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని వేసి రికార్డు నెలకొల్పాడు. దీనిని మరెవరూ అందుకోలేకపోయారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో కశ్మీర్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ 156 కిలోమీటర్ల వేగం వరకు వెళ్లాడు. అయితే, అక్తర్ రికార్డున అందుకోవడం మరెవరి తరమూ కాదు. అతడి వేగం ప్రస్తుత క్రికెటర్లలో ఎవరికీ లేదు. ఉమ్రాన్ ఆశలు రేపుతున్నా.. ఆ స్థాయికి చేరుతాడా? అనేది చూడాల్సిందే.
Tags:    

Similar News