తుపాకీ గొట్టానికి తాళం వేస్తార‌ట‌.. సాధ్య‌మేనా?

Update: 2021-04-09 06:21 GMT
ప్ర‌పంచంలో ఎక్క‌డైనా తుపాకీ పేలింద‌న్న‌ది పెద్ద వార్త‌. అమెరికాలో మాత్రం సాధార‌ణ వార్త‌గా త‌యారైంది. తుపాకీ కాల‌డ‌మే కాదు.. ప్రాణాలు కోల్పోవ‌డం కూడా స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయింద‌క్క‌డ‌. ఇటీవ‌ల స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే మూడుసార్లు సంభ‌వించిన కాల్పుల ఘ‌ట‌న‌ల్లో ఏకంగా 24 మంది అమాయ‌కులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో అభంశుభం తెలియ‌ని ఓ చిన్నారి కూడా ఉండ‌డం మ‌రింత విషాదం. అయితే.. ఇలాంటి ఘ‌ట‌న‌లు యూఎస్ లో త‌ర‌చూ జ‌రుగుతూనే ఉన్నాయి. ద‌శాబ్దాలుగా ఈ సంస్కృతి మ‌రింత పెచ్చ‌రిల్లుతోంది. ఈ దారుణాల‌కు చ‌ర‌మ‌గీతం పాడాల‌ని కొత్త అధ్య‌క్షుడు బైడెన్ నిర్ణ‌యించుకున్న‌ట్టున్నారు. ఈ మేర‌కు ప‌లు సంస్క‌ర‌ణ‌లకు సిద్ధ‌మ‌య్యారు.

ప్ర‌పంచానికి తుపాకులు, ఆయుధాల‌ను అమ్ముకోవ‌డంలో అమెరికాను మించిన వారు లేరన్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. య‌థారాజా అన్న‌ట్టుగా.. అమెరికాలో విచ్చ‌ల‌విడిగా తుపాకుల త‌యారీ, అమ్మ‌కాలు సాగుతుంటాయట‌. తుపాకీ విడిభాగాలు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ విక్ర‌యిస్తుంటారని, వాటిని కొనుక్కొచ్చి, ఇళ్ల‌లోనే తుపాకులు త‌యారు చేస్తూ.. అమ్మేస్తుంటార‌ని స‌మాచారం.

దీంతో.. అమెరిక‌న్ వాసుల్లో చాలా మంది బ్యాగుల్లో, జేబుల్లో తుపాకులు క‌నిపిస్తుంటాయ‌ని చెబుతుంటారు. లైసెన్స్ గ‌న్ అయితే.. ఎక్క‌డ కొనుగోలు చేశారో రికార్డులు ఉంటాయి. వాటిని ఉప‌యోగిస్తే.. వివ‌రాల‌న్నీ తెలిసిపోతాయి. కానీ.. విడిభాగాలు తెచ్చి, అసెంబుల్డ్ గ‌న్ త‌యారు చేస్తే.. దానికి వివ‌రాలు ఎక్క‌డివి? అందుకే.. చాలా కేసుల్లో తుపాకీ ఎక్క‌డి నుంచి వ‌చ్చింద‌నేది క‌నుక్కోవ‌డం పోలీసుల‌కు స‌వాల్ గా మారుతోందట‌. అంతేకాదు.. చాలా ఘ‌ట‌న‌ల్లో ఇలాంటి తుపాకుల‌ను ఉప‌యోగిస్తున్నార‌ని స‌మాచారం.

ఈ విధంగా.. అమెరికాలో అడ్డూ అదుపూ లేకుండా పేలుతున్న తుపాకీకి తాళం వేయాలని నిశ్చయించుకున్నారు అధ్య‌క్షుడు బైడెన్. ఈ మేర‌కు ‘గ‌న్ వ‌యెలెన్స్ ప‌బ్లిక్ హెల్త్ ఎప‌డిమిక్‌’ పేరుతో ఉత్త‌ర్వులు కూడా జారీచేశారు. దేశంలో తుపాకుల నియంత్ర‌ణ వ్య‌వ‌స్థకు స‌ల‌హాదారుడైన డేవిడ్ చిప్ మ్యాన్ ను బ్యూరో ఆఫ్ ఆల్క‌హాల్‌, టొబాకో, ఫైర్ ఆర్మ్స్, ఎక్స్ ప్లోజివ్స్ సంస్థ (ఏటీఎఫ్‌)కు డైరెక్ట‌ర్ గా నియ‌మించారు. వీరంతా క‌లిసి అమెరికాలో తుపాకుల మోత‌ను ఆపేయాల‌ని గ‌ట్టిగానే ట్రై చేస్తున్నారు.

త‌మకు ప్రాణ‌భ‌యం ఉంద‌ని చెబుతూ చాలా మంది అమెరిక‌న్లు తుపాకులు వెంట పెట్టుకొని తిరుగుతుంటారట‌. ఇక‌, వాటి త‌యారీ విశృంఖ‌లంగా ఉన్న నేప‌థ్యంలో వాట‌న్నింటినీ క‌ట్ట‌డి చేయ‌డానికి పెద్ద నియ‌మావ‌ళినే రూపొందించారు. కానీ.. అమెరిక‌న్ కాంగ్రెస్ లో ఆ బిల్లు నెగ్గుతుందా? అన్న‌దే సందేహం. బైడెన్ స‌ర్కారు తెచ్చిన చాలా ప్ర‌తిపాద‌న‌ల‌కు రిప‌బ్లిక‌న్లు వ్య‌తిరేకంగా ఉన్నట్టు తెలుస్తోంది. మ‌రి, చివ‌ర‌కు ఏం జ‌రుగుతుంది? అమెరికాలో తుపాకుల మోతలు ఆగుతాయా? దానికి కాంగ్రెస్ శ్రీకారం చుడుతుందా? లేదా? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News