ర‌ష్యాతో అమెరికా స్నేహ గీతం.. కారణం ఇదే?

Update: 2021-06-18 13:30 GMT
రెండో ప్ర‌పంచ యుద్ధంలో.. ర‌వి అస్త‌మించ‌ని బ్రిటీష్ సామ్రాజ్యం ఆర్థికంగా, సైనిక ప‌రంగా తీవ్రంగా దెబ్బ తిన్న త‌ర్వాత, ప్ర‌పంచంపై ఆధిప‌త్యం కోసం రెండు దేశాలు తీవ్రంగా ప్ర‌య‌త్నించాయి. అందులో ఒక‌టి పెట్టుబ‌డి దారీ స‌మాజాన్ని కాంక్షించే అమెరికా కాగా.. రెండోది సోష‌లిస్టు స‌మాజాన్ని కోరుకునే ర‌ష్యా. బోల్షివిక్ విప్ల‌వ విజ‌యం త‌ర్వాత జార్ చ‌క్ర‌వ‌ర్తుల పాల‌న‌ను కూల‌దోసి, లెనిన్ సార‌థ్యంలో సోష‌లిస్టు ప్ర‌భుత్వం ఏర్పాటైంది ర‌ష్యాలో. ఆ త‌ర్వాత‌ అన‌తికాలంలోనే సోవియట్ యూనియ‌న్‌ బ‌ల‌మైన ఆర్థిక శ‌క్తిగా ఎదిగింది. అటు అప్ప‌టికే ప్ర‌బ‌ల ఆర్థిక‌శ‌క్తిగా ఎదుగుతూ వ‌చ్చిన‌ అమెరికా.. సోవియ‌ట్ యూనియ‌న్ శ‌క్తిని నిలువ‌రించేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. ఈ విధంగా.. ఈ రెండూ ప్ర‌పంచ ఆధిప‌త్యం కోసం ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం కొన‌సాగించాయి. ఈ పోరాటం ద‌శాబ్దాల కాలం కొన‌సాగింది.

కానీ.. డెబ్బై ఏళ్లు కొన‌సాగిన ర‌ష్యా సోవియ‌ట్ యూనియ‌న్.. 1991లో కూలిపోయింది. దీనివెనుక అమెరికా త‌దిత‌ర సామ్రాజ్య‌వాద దేశాల పాత్ర ప్ర‌ముఖంగా ఉంద‌నే విమ‌ర్శ‌లు అప్ప‌టి నుంచీ ఉన్నాయి. మొత్తానికి సోవియ‌ట్ యూనియ‌న్ ప్ర‌భుత్వం కుప్ప‌కూల‌డంతో.. యూనియ‌న్ లోని భూభాగాల‌న్నీ స్వ‌తంత్ర దేశాలుగా వెలిశాయి. దాదాపు ముప్పైకి పైగా దేశాలుగా విడిపోయింది సోవియట్‌ యూనియ‌న్‌. దీంతో.. అమెరికాకు ఎదురు లేకుండా పోయింది. ప్ర‌పంచంలోనే అగ్ర‌రాజ్యంగా అవ‌త‌రించింది. 90వ ద‌శ‌కం నుంచి అమెరికా ఆధిప‌త్యం అప్ర‌తిహ‌తంగా కొన‌సాగుతూ వ‌స్తోంది. ప్ర‌పంచ దేశాల‌కు మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తూ.. మాట విన‌ని దేశాల‌పై దాడులు చేస్తున్న వైనాన్ని కూడా చ‌రిత్ర‌లో ప‌రిశీలించొచ్చు.

అయితే.. కాలం ఎప్పుడూ ఒకే తీరుగా ఉండ‌దు క‌దా. ప‌రిస్థితులు వేగంగా మారిపోయాయి. ర‌ష్యా మాదిరిగానే క‌మ్యూనిస్టు దేశంగా ఉన్న చైనా.. గ‌డిచిన ద‌శాబ్ద కాలంలో ప్ర‌బ‌ల‌మైన ఆర్థిక శ‌క్తిగా అవ‌త‌రించింది. ఆర్థిక‌, సైనిక అంశాల్లో.. అమెరికాను స‌వాల్ చేసే స్థాయికి ఎదిగింది. పారిశ్రామికంగానూ గ‌ణ‌నీయ‌మైన ప్ర‌గ‌తిని సాధించింది. వృద్ధి రేటు ఎల్ల‌ప్పుడూ రెండంకెల పైనే న‌మోద‌వుతూ.. దూసుకెళ్తోంది.  ఈ క‌రోనా కాలంలోనూ ఆ దేశ జీడీపీ ఎదుగుద‌ల చూస్తే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మాన‌దు. నేష‌న‌ల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వివ‌రాల ప్ర‌కారం.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 18.3 శాతం వృద్ధిరేటు న‌మోదు చేసింది చైనా. ఇది 2.85 కోట్ల కోట్ల‌కు స‌మానం. 1992 త‌ర్వాత చైనా ఈ స్థాయిలో జ‌డీపీ న‌మోదు చేయ‌డం ఇదే మొద‌టి సారి. పారిశ్రామిక అభివృద్ధిలో 14.1 శాతం, రిటైల్ విక్ర‌యాల్లో 34.3 శాతం అభివృద్ధి సాధించింది. ఈ విధ‌మైన అభివృద్ధితో.. ప్ర‌పంచంలో అమెరికా త‌ర్వాత రెండో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా  చైనా అవ‌త‌రించింది. 2010 త‌ర్వాత జ‌పాన్ ను వెన‌క్కు నెట్టేసింది.

ఇదే దూకుడు కొన‌సాగిస్తే.. స‌మీప భ‌విష్య‌త్ లోనే అమెరికాను దాటేసి, ప్ర‌పంచంలో అతిపెద్ద ఆర్థిక శ‌క్తిగా ఎదిగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే.. అమెరికా అప్ర‌మ‌త్త‌మైంది. చైనా దూకుడును త‌గ్గించేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. జీ7 దేశాల కూట‌మితో శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఈ కూట‌మి శిఖ‌రాగ్ర స‌మావేశాల్లో ప్ర‌ధాన చ‌ర్చ చైనా మీద‌నే సాగ‌డం గ‌మ‌నించాల్సిన అంశం. ఈ నేప‌థ్యంలోనే మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. ఎల్ల‌ప్పుడూ ఉప్పు, నిప్పులా ఉండే ర‌ష్యాకు స్నేహ హ‌స్తం చాచ‌డం విశేషం. తాజాగా జెనీవాలో ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ తో అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ స‌మావేశ‌మ‌య్యారు. వీరి చ‌ర్చ‌ల సారాంశం బ‌య‌ట‌కు చెప్పేది ఎలా ఉన్నా.. అంత‌ర్గ‌తంగా చైనాకు చెక్ పెట్ట‌డానికే అమెరికా ప్ర‌య‌త్నిస్తోందన్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం.

లెనిన్ వార‌స‌త్వాన్ని తీసుకున్న‌ ర‌ష్యా.. ఇప్ప‌టికీ క‌మ్యూనిజమే అంతిమ ల‌క్ష్యంగా ప్ర‌యాణం సాగిస్తోంది. అటు చైనా కూడా క‌మ్యూనిస్టు దేశం కాబ‌ట్టి.. స‌హ‌జంగానే ఈ రెండు దేశాలు స‌హ‌క‌రించుకుంటాయి. ఇప్ప‌టి వ‌రకూ జ‌రిగింది కూడా ఇదే. అయితే.. ఉన్న‌ట్టుండి అమెరికా ర‌ష్యాకు స్నేహ హ‌స్తం చాచ‌డంలో ఆంత‌ర్యం ఏంట‌న్న‌ది అంద‌రికీ సుల‌భంగా అర్థమ‌వుతోంది. కరోనా తొలి ద‌శ‌లో అమెరికా ఆర్థికంగా చాలా దెబ్బ‌తిన్న‌ది. అదే స‌మ‌యంలో చైనా వృద్ధి రేటు దూసుకెళ్తోంది. ఇవ‌న్నీ స‌మీక్షించిన త‌ర్వాతే బైడెన్ మెట్టు దిగార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మొత్తానికి.. ప్ర‌పంచంలో ఇది ఆస‌క్తిక‌ర ప‌రిణామం. మ‌రి, మున్ముందు ఇంకెలాంటి ప‌రిస్థితులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.
Tags:    

Similar News