కలిసినంతనే.. బ్రిటన్ ప్రధాని పెళ్లి పై బైడెన్ షాకింగ్ వ్యాఖ్యలు

Update: 2021-06-11 04:03 GMT
సాధారణంగా రెండు దేశాధ్యక్షులు కలిసినంతనే గౌరవపూర్వకంగా మాటామంతి నడుస్తుంది. అందుకు భిన్నంగా సరదాగా.. అంతకు మించిన ఉల్లాసంగా జోకులు వేసుకోవటం.. వ్యక్తిగత అంశాలపై వ్యాఖ్యలు చేయటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. తాజాగా అలాంటి ఉదంతమే జరిగి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జో బైడెన్ చేస్తున్న తొలి విదేశీ పర్యటన గురించి తెలిసిందే.

తాజాగా ఆయన బ్రిటన్ పర్యటనలో ఉన్నారు. అక్కడ జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. బ్రిటన్ లో కాలు మోపిన జో బైడెన్ కు స్వాగతం పలికారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. ఈ సందర్భంగా ఆయన్ను ఉద్దేశంచి బైడెన్ ఊహించని రీతిలో రియాక్టు అయ్యారు. తనకు ఎదురైన బోరిస్ ను ఉద్దేశించి.. ‘మనిద్దరం తాహతుకు మించి పెళ్లి చేసుకున్నాం’ అంటూ జోకేయటం ఆసక్తికరంగా మారింది. 56 ఏళ్ల బోరిస్ ఈ మధ్యనే 33 ఏళ్ల సిమండ్స్ ను పెళ్లి చేసుకోవటం తెలిసిందే. ఇది ఆయన మూడో పెళ్లి. బైడెన్ కూడా రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

కొత్త పెళ్లి కొడుకును తనదైన రీతిలో ఆటపట్టించారు బైడెన్. అయితే.. ఆయన జోక్ కు బోరిస్ అంతే స్థాయిలో రియాక్టు అయ్యారు. మీతోఈ విషయంలో విభేదించటం లేదు.. ఈ విషయంలోనే కాదు.. ఏ విషయంలోనూ అంటూ నవ్వేసినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. కీలకమైన రాజకీయ చర్చల కోసం సాగుతున్న పర్యటనలో ఇలాంటి ఉల్లాస ఘటనలు ఈ మధ్యన పెద్దగా చోటు చేసుకోవటం లేదు. తాజా ఉదంతం.. ఆ కొరతను తీర్చిందనే చెప్పాలి.
Tags:    

Similar News