బిగ్ క్వశ్చన్: విజయసాయి కాపా? రెడ్డా?

Update: 2019-12-16 04:30 GMT
ఇటీవల కాలంలో కొన్నిసిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అలాంటి కోవకే చెందింది తాజా ఘటన. చాలా సందర్భాల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నంటే ఉంటూ.. ఆయనకు కళ్లు.. చెవులుగా వ్యవహరించే వ్యక్తిగా విజయసాయిరెడ్డిని చెప్పాలి. రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్న ఆయనకు జగన్ దగ్గర ఉన్న యాక్సిస్ మరెవరికీ లేదనే చెప్పాలి. కీలకమైన విషయాల్లో జగన్ కు బ్రీఫ్ చేయాలంటే ఆయనకు మాత్రమే చెల్లంటారు.

ఏ సమయంలో అయినా ఎలాంటి అంశాన్నైనా జగన్ కు చెప్పే ధైర్యం.. దగ్గరితనం విజయసాయికి మాత్రమే ఉందన్న విషయం తెలిసిందే. అలాంటి విజయసాయి ఏ కులానికి చెందిన వారు? అన్న ప్రశ్న వేస్తే.. మరో ఆలోచన లేకుండా సమాధానం చెప్పేస్తుంటారు. కానీ.. అదే మాత్రం నిజం కాదన్న విషయాన్ని విజయసాయిరెడ్డే తాజాగా చెప్పటం ఆసక్తికరంగా మారింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు దరిద్రపు అలవాట్లకు కేరాఫ్ గా నిలుస్తుంటుంది ఆంధప్రదేశ్. అదేమంటారా? కుల సంఘాల ఆత్మీయ సమావేశాలు. గతంలో చాలా తక్కువగా ఉన్నప్పటికీ.. ఇటీవల కాలంలో అంతకంతకూ పెరిగిపోతూ.. అదో పిచ్చగా మారింది. చివరకు ఈ పోకడ తెలంగాణ రాష్ట్రానికి కూడా పట్టేసింది. మిగిలిన రోజుల సంగతి ఎలా ఉన్నా.. కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. ఈ జోరు మరింత ఎక్కువగా కనిపిస్తుంది.వివిధ కులాలకు చెందిన ఆత్మీయ సమావేశాల్ని ఏర్పాటు చేస్తారు.

తాజాగా విశాఖపట్నంలో కాపు.. తెలగ.. బలిజ.. తూర్పు కాపు.. మున్నూరు కాపు.. ఒంటరి కులాలకు చెందిన వారంతా కాపునాడు ఆధ్వర్యంలో కంబాలకొండ వద్ద ఆత్మీయ కలయిక పేరుతో ఒక భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీని కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. రిటైర్డ్ డీజీపీ సాంబశివరావుతో సహా పలువురు కాపు వర్గానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి  మంత్రి ముత్తంశెట్టి అలియాస్ అవంతి శ్రీనివాస్ వచ్చారు. ఆయనతో పాటు ఎంపీ విజయసాయి రెడ్డి..వీఎంఆర్ డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్.. మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ్ ప్రసాద్ తో  సహా పలువురు హాజరయ్యారు. విజయసాయిని చూసినంతనే.. జై కాపు.. జైజైకాపు అంటూ నినాదాలు షురూ అయ్యాయి. విజయసాయితో జ్యోతి ప్రజల్వన కార్యక్రమం నిర్వహించటంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కాపుల పిక్నిక్కా లేదంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్ీ పిక్నిక్కా? అంటూ అభ్యంతరం వ్యక్తమైంది. ఈ సమయంలో మైకు అందుకున్న విజయసాయి.. తాను కూడా కాపునేనని.. నెల్లూరు జిల్లాలో రెడ్లను కాపులుగానే పిలుస్తారని.. కావాలంటే తన పదో తరగతి సర్టిఫికేట్ మీద ఓసీ కాపు అని ఉంటుందన్నారు. కావాలంటే చెక్ చేయాలని చెప్పినా.. ఆందోళనలు ఆగలేదు. దీంతో ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు.  ఈ పరిణామంతో మంత్రి అవంతి తీవ్ర అసహనానికి గురయ్యారు. ఏమైనా.. తాజా పరిణామం విజయసాయి ఏ మాత్రం ఊహించనిదిగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News