ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు బిగ్ షాక్

Update: 2022-04-24 14:37 GMT
హనుమాన్ చాలీసా వివాదంలో నటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ చిక్కుల్లో పడ్డారు. ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రాణాలను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారన్న అభియోగాలపై వారిని ఖార్ పోలీసులు అరెస్ట్ చేశారు.

నేడు నవనీత్ రాణా దంపతులను పోలీసులు బాంద్రా మెజిస్ట్రేట్ ఎదుట కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలోనే నవనీత్ రాణా దంపతుల తరుఫు న్యాయవాది కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. ఈనెల 29న బెయిల్ పిటీషన్ పై విచారణ జరుగనుంది.

హనుమాన్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే హనుమాన్ చాలీసా పఠించాలని.. లేకుంటే తామే సీఎం నివాసం ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని నవనీత్ కౌర్, ఆమె భర్త రవిరాణా ప్రకటించారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన కార్యకర్తలు నిన్న ఖార్ లోని నవనీత్ రాణా నివాసం ఎదుట ఆందోళనకు దిగారు. నవనీత్ దంపతుల ఫిర్యాదు మేరకు శివసేన కార్యకర్తలపై కేసు నమోదైంది.

ఇక ప్రధాని నరేంద్రమోడీ పర్యటన నేపథ్యంలో సీఎం నివాసం ఎదుట హనుమాన్ చాలీసా పఠించాలన్న తమ కార్యాచరణను నవనీత్ రాణా, రవిరాణా విరమించుకున్నారు.

ఈ క్రమంలోనే రాష్ట్రంలో శాంతిభద్రతల కారణంగా ప్రధాని పర్యటనకు ఆటంకం కలుగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే నవనీత్ దంపతులు విసిరిన ఈ సవాల్ మత కలహాలకు దారితీసేలా ఉందంటూ ముంబై పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. శుక్రవారమే నోటీసులు కూడా జారీ చేశారు. తాజాగా అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుచగా 14 రోజుల కస్టడీని కోర్టు విధించింది.
Tags:    

Similar News