తుదిశ్వాస విడిచిన రాష్ట్రమంత్రి వినోద్ సింగ్ !

Update: 2020-10-12 14:00 GMT
బీజేపీ నేత, బిహార్ మంత్రి వినోద్ సింగ్ సోమవారం తుదిశ్వాస విడిచారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో బిసి సంక్షేమ మంత్రిగా కొనసాగుతున్నారు. ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అయితే, మంత్రి వినోద్ సింగ్‌‌ జూన్‌ 28న కరోనా బారినపడ్డారు. మంత్రితోపాటు ఆయన భార్యకు కూడా కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో కతియార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స అందజేశారు.

అయితే , కరోనా వైరస్ నుంచి కోలుకున్నా ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో చికిత్స కోసం పట్నా నుంచి ఆగస్టు 16న ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని మేదాంత హాస్పిటల్ ‌కు తరలించారు. గత రెండు నెలలుగా ఆయనకు చికిత్స కొనసాగిస్తున్నా పరిస్థితి మెరుగుపడలేదు. సోమవారం ఉదయం ఆయన మెదడులో రక్తస్రావం కావడంతో చనిపోయారు. ఆయనకు మెదడులో రెండుచోట్ల రక్తం గడ్డకట్టినట్టు వైద్యులు గుర్తించారు.

విద్యార్ధి దశ నుంచే రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన వినోద్.. ఏబీవీపీ నేతగా ఉన్నారు. తర్వాత కతియార్ జిల్లా బీజేపీ యువజన విభాగం అధ్యక్షుడిగా, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వినోద్ సింగ్.. బీజేపీలో అత్యంత వేగంగా ఎదిగిన వెనుకబడిన వర్గాల నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. తొలిసారి 2000 ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన 2010, 2015లో వరుసగా గెలుపొందారు. ప్రస్తుతం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వినోద్ సింగ్ భార్య నిషా సింగ్‌కు బీజేపీ టిక్కెట్ కేటాయించింది. ప్రన్‌పూర్ స్థానం నుంచి ఆమె పోటీచేస్తున్నారు.
Tags:    

Similar News